Midwifery: తల్లీ, బిడ్డా క్షేమంగా ఉండేలా చూస్తూ... సాధారణ ప్రసవాలను పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన మిడ్ వైఫరీ వ్యవస్థ మంచి ఫలితాలిస్తోంది. నర్సింగ్ పూర్తిచేసిన మహిళలకు ప్రభుత్వం మిడ్‌వైఫరీలో శిక్షణనిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం సేవలందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 300మంది శిక్షణ పూర్తిచేసుకోగా కరీంనగర్, భద్రాచలం, సిరిసిల్ల గజ్వేల్ సహా పలు జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలోనే ప్రస్తుతం మిడ్ వైవ్స్ అందుబాటులో ఉన్నారు. గతేడాది నవంబర్ నుంచి పాలమూరులో మిడ్ వైవ్స్‌సేవలు ప్రారంభమయ్యాయి. డ్యూటీ డాక్టర్ల పర్యవేక్షణలో ఇప్పటి వరకూ నవంబర్‌లో- 61, డిసెంబర్‌లో- 42, జనవరిలో- 51, ఫిబ్రవరిలో- 64 మందికి సురక్షిత, సాధారణ ప్రసవాలు చేశారు.
ప్రసవాల విషయంలో ప్రత్యేకంగా..
ప్రభుత్వాసుపత్రుల్లో ఇతర వైద్య సిబ్బంది ఉన్నా... ప్రసవాల విషయంలో మిడ్‌వైవ్స్ ప్రత్యేకంగా పనిచేస్తారు. పరీక్షల కోసం వచ్చిన గర్భిణులకు ముందు నుంచే సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తారు. గర్భం నుంచి ప్రసవం వరకూ వారి ఆరోగ్యాన్ని సునిశితంగా పర్యవేక్షిస్తారు. ప్రమాదకరమయ్యే అవకాశమున్న కేసులను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తారు. సాధారణ ప్రసవానికి అవసరమైన వ్యాయామాలు, ఆహారం, జాగ్రత్తలు సూచిస్తారు. ప్రసవానికి ముందు సహజకాన్పు అయ్యేలా గర్భిణులతో వ్యాయామాలు చేయిస్తారు. ప్రసవ సమయంలో మానసికంగా గర్భిణులు ధైర్యం కోల్పోకుండా సహకరిస్తారు. ప్రసవానంతరం ఆరువారాల పాటు తల్లీ బిడ్డకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చెబుతారు.
ప్రసవాలపై శిక్షణ
ప్రభుత్వాసుపత్రుల్లో ఈ తరహా సేవల్ని విస్తృతం చేసేందుకు జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 10మంది స్టాఫ్‌నర్సులకు సురక్షిత, సాధారణ ప్రసవాలపై శిక్షణనిస్తున్నారు. ఈ శిక్షణ తర్వాత తమ ప్రవర్తనలో, గర్భిణులను చూసుకునే విధానంలోనూ చాలా తేడా వచ్చిందటున్నారు స్టాఫ్ నర్సులు. శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు తగ్గించేందుకు మిడ్‌వైవ్స్ సహకారం ఎంతో ఉందని... వైద్యులు కూడా అంటున్నారు.
వెల్లువెత్తుతున్న డిమాండ్లు
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రస్తుతం ఒక మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో మాత్రమే ముగ్గురు మిడ్‌వైవ్స్ పనిచేస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 ప్రసవాలు జరుగుతుండగా... వారి విషయంలో జాగ్రత్త వహించేందుకు ఇప్పుడున్న మిడ్‌వైవ్స్ సరిపోవడం లేదు. వారి సంఖ్యను పెంచడంతోపాటు... మిగిలిన జిల్లాల్లోనూ నియమించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: