మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ది పనులకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలగొద్దని.. అందుకనుగుణంగా బడ్జెట్ సమావేశం వాయిదా వేయకుండా టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్ సమావేశంలో ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పురపాలికకు పన్నులు సరిగా వసూలు కావడం లేదని, ఆదాయం కూడా తగ్గిందని మంత్రి తెలిపారు. అయినా ఉన్న నిధులతో పాలమూరులో అభివృద్ది పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
2020-2021 ఆర్థిక సంవత్సరముకుగాను జరగాల్సిన బడ్జెట్ సమావేశంను లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేయకుండ టెలీ కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించి ఆమోదించారు. మహబూబ్‌నగర్ పురపాలక సాధరణ ఆంచనా బడ్జెట్ 67 కోట్ల 86లక్షలు ఉండగా.. 25 కోట్ల 13 లక్షలు పన్ను రాబడి నుంచి, 21 కోట్ల 89 లక్షలు పన్నెతర రాబడితో పాటు 6 కోట్ల అసైన్డ్ రాబడి, 2019-2020 ఆర్థిక సంవత్సరానికి మిగులు బడ్జెట్‌గా ఉన్న 14 కోట్ల 83 లక్షలతో అంచనా వేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జనవరి 27న కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఫిబ్రవరి 10న పరిచయ కార్యక్రమం పేరిట తొలి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఇదీ చూడండి: పారిశుద్ధ్య లోపం.. పొంచి ఉంది అనారోగ్యం