ఈనెలాఖరు వరకు లాక్డౌన్ పాటించి ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తులు పెడచెవిన పెట్టి... ప్రయాణాలు సాగిస్తున్న వారి కష్టాలు అన్నీఇన్నీ కావు. గమ్యస్థానాలకు చేరుకునే దారిలేక నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉపాధి కోసం వేలాది కుటుంబాలు ముంబయి, పూణె, హైదరాబాద్ సహా పలు పట్టణాలకు వలస వెళ్లారు. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వాళ్లంతా సొంతూళ్లకు పయనమయ్యారు. బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు సైతం నడవకపోవడం వల్ల కాలినడకన సొంతూళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధాన రహదారుల్లో వాహనాల సాయం తీసుకున్నా.. గ్రామాల్లోకి వెళ్లేందుకు సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల కాళ్లకు పనిచెప్పక తప్పడం లేదు. కొందరు భార్య, పిల్లలు, వృద్ధులతోనూ ప్రయాణాలు సాగిస్తున్నారు. దారిలో మంచినీళ్లు, ఆహారం దొరక్క ఇబ్బందులకు గురవుతున్నారు. తీరా గ్రామాలకు వెళ్లినా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లను ఊళ్లోకి రానివ్వకపోవడం వల్ల దిక్కుతోచని పరిస్థితి అవుతోంది. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు పెట్టుకోకుండా.. ఇళ్లకే పరిమితం కావాలని.. ఎక్కడున్న వాళ్లు అక్కడే ఉండాలని పోలీసులు, అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము