స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన విత్తన బంతులతో మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు సృష్టించింది. విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించడం ద్వారా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. మహబూబ్‌నగర్ రైల్వే కమ్యూనిటీ హాల్ వేదికగా ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. 'టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్‌హెచ్‌జీ ట్రాన్స్ఫామ్ మహబూబ్‌నగర్ ఇన్‌టూ హెటెరో గ్రీన్ బెల్ట్' అనే వాక్యాన్ని మహిళలు విత్తన బంతులతో వరుసగా పేర్చారు. 81 అక్షరాలను 81 మంది మహిళలు ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకూ పేర్చారు. అనంతరం ఎన్ని విత్తన బంతులతో ఆ వాక్యాన్ని రూపొందించారో లెక్కించారు. ఈ ప్రక్రియను గిన్నిస్ బుక్ ప్రతినిధులు రిశినాథ్, భారత ప్రతినిధి నిఖిల్ శుక్లా, లండన్ నుంచి ఆండ్రూఫ్ ఆన్లైన్లో పర్యవేక్షించారు.
ఆన్లైన్ ఆధారాలు, ఫొటో సాక్ష్యాలు, ఇతర నివేదికలు పరిశీలించిన అనంతరం.. 73 వేల 918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యానికి రూపకల్పన చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్లు రిశినాథ్ వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు, పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, మెప్మా, హెటెరో గ్రూపులు ఈ రికార్డును నెలకొల్పినట్లుగా వెల్లడించారు. విత్తన బంతులు పేర్చే ప్రక్రియను కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతోశ్కుమార్లు సందర్శించారు. గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించిన మహిళల చొరవను అభినందించారు.
గతేడాది కోటి విత్తన బంతులు తయారు చేసిన పాలమూరు స్వయం సహాయక బృందాల మహిళలు.. ఈసారి 2 కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులు తయారు చేసి సత్తా చాటారు. డీఆర్డీఏ, మెప్మా కలుపుకుని 10,432 సంఘాలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. డీఆర్డీఏ కోటీ 78 లక్షలు, మెప్మా ద్వారా 30 లక్షల విత్తన బంతులను కేవలం 10 రోజుల్లో పూర్తి చేశారు. అందుకోసం మహిళలంతా స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు సాధించేందుకు స్ఫూర్తినిచ్చిందన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితం..
ఈ విజయాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అంకితమిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. 'టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్‌హెచ్‌జీ ఉమెన్ ట్రాన్స్ఫామ్ మహబూబ్‌నగర్ ఇన్‌టూ హెటెరో గ్రీన్ బెల్ట్' అనే వాక్యాన్ని మహిళలు విత్తన బంతులతో రూపొందించారు.
ఇదీ చూడండి: post covid problems: దేశంలోనే తొలిసారిగా పోస్ట్ కొవిడ్ ఆస్పత్రి