మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని... వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట్‌రావు ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా అదికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కరోనా బారిన పడిన వారిని, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, వసతులపై ఆరా తీయాలన్నారు. మానవతా దృక్పథంతో వారికి ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని పరీక్షించేందుకు వైద్యులను వెంటనే నియమించాలని అధికారులను ఆదేశించారు. ఐసోలేషన్‌లో ఉన్న వారికి మెడికల్ కళాశాలలో వండుతున్న భోజనాన్ని మూడు పూటలు అందేలా పర్యవేక్షించాలని కోరారు.
చరవాణిలో మంత్రి సూచనలు..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చరవాణిలో జిల్లా అధికారులకు వైద్యులకు, కొవిడ్ బృందాలకు పలు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలో మరో రెండు కొవిడ్ నిర్ధారణ కేంద్రాలు ప్రారంభిస్తున్నటు మంత్రి పేర్కొన్నారు. వైద్యాధికారులు, జిల్లా అధికారులు ప్రతి నిత్యం కంటైన్మెంట్ జోన్లలో, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారితో మాట్లాడాలన్నారు. వారి వైద్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చూడండి: సర్దార్ పాపన్నకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి