దసరా నుంచి ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌పై నమూనా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహసీల్దార్ల కార్యాలయాల్లో ప్రారంభమైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే ధరణి పోర్టల్ నిర్వాహణకు అవసరమైన కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, ప్రింటర్లు, వెబ్‌కెమెరాలు సహా ఇతర సామాగ్రిని సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై సుమారు మూడున్నర గంటల పాటు శిక్షణ అందించారు. రిజిస్ట్రేషన్ల కోసం వినియోగదారులు స్లాట్ బుక్ చేసుకోవడం, సేల్ డీడ్, ఈ పాస్‌బుక్ వరకూ అన్ని ప్రక్రియలపై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, కో ఆర్డినేటర్లకు శిక్షణ అందించారు. ఈ మేరకు శనివారం స్లాట్ బుకింగ్, సేల్డీడ్లు సిబ్బంది పూర్తి చేశారు. ఆదివారం నుంచి ప్రతీ తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ కనీసంగా 10 రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందస్తు సన్నాహకంగా వీటిని చేపడుతున్నారు.
మీ సేవా కేంద్రాల్లో
ధరణి పోర్టల్లో నమూనా రిజిస్ట్రేషన్ ప్రకారం వ్యవసాయ భూముల్ని అమ్మినా, కొనుగోలు చేసినా ఆయా భూముల రిజిస్ట్రేషన్ కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల విక్రేత, కొనుగోలు దారు, సాక్షులు సహా అధికారుల సమయం వృథా కాకుండా ఉంటుంది. స్లాట్‌లో విక్రేత, కొనుగోలు దారు, సాక్షులు ఏ సమయంలో హాజరు కావాలి.. వెంట ఏఏ దస్త్రాలు తీసుకురావాలి అన్నది స్పష్టంగా రాసి ఉంటుంది. తెలుగులో కావాలంటే తెలుగులో, ఆంగ్లంలో కావాలంటే ఆంగ్లంలో స్లాట్ బుకింగ్ పత్రాన్ని అందిస్తారు. దానిని ఆన్లైన్లో లేదా మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకోవచ్చు. కోరిన తేదీలు, ముహుర్తాలు కలిసి వచ్చేలా వాటిని బుక్ చేసుకునే అవకాశం ఉంది. క్రయ విక్రయాలు జరిగిన రోజే సేల్ డీడ్, ఈ పాస్ బుక్ అందించేలా దానిని రూపొందించారు. విరాసత్‌లు సైతం సులువుగా పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోలు, స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అన్ని వరాలు అందులో ఉంటాయి. క్రయ విక్రయాలు జరిగిన రోజునే ధరణి పోర్టల్లో భూములు ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరుకు మార్చి ఈ పాస్‌బుక్‌ను అందిస్తారు. కొద్ది రోజుల్లో ఒరిజినల్ పాస్‌బుక్‌ను సైతం రిజిస్ట్రార్ పోస్టులో వినియోగ దారునికి అందుతుందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు.
నమూనా రిజిస్ట్రేషన్లు
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంట్ రైటర్లు, మధ్య వర్తుల అవసరం ఉండదు. ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ యూజర్ ఫ్రెండ్లీగా ఉందని, సులువుగా నిర్వహించవచ్చని పలువురు తహసీల్దార్లు అంటున్నారు. దసరా వరకూ నమూనా రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ సహా ఇతర లోపాలు ఏవైనా ఉంటే అవి బైటపడనున్నాయి. వాటిని అధిగమిస్తేనే ఈ విధానం విజయవంతమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి : వరద ముంపులో భాగ్యనగరం.. నీళ్లలోనే ప్రజలు