వామన్రావు దంపతుల హత్యను ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా మహబూబ్‌నగర్ కేంద్రంలోని జిల్లా కోర్టు భవన సముదాయం నుంచి తెలంగాణ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.
న్యాయం కోసం పోరాడే న్యాయవాదులను కిరాతకంగా నడి రోడ్డుపై హత్య చేయడం దారుణమని అనంతరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్న ఆయన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని.. రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.
న్యాయవాద దంపతుల హత్యకేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఫెడరేషన్ ఆఫ్ బార్ ఆసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి 3 వరకు బార్ అసోసియేషన్ల ముందు రిలే నిరాహర దీక్షలు చేపడతామని తెలిపింది. వచ్చే నెల 9న పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: మంత్రులతో సీఎం భేటీ... ఎమ్మెల్సీ, సాగర్ ఉపఎన్నికపై చర్చ!