Kalwakurthy Lift Irrigation Project News : ఉమ్మడి పాలముూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించే మహాత్మాగాందీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో.. దెబ్బతిన్న మోటార్ల మరమ్మతుల్లో జాప్యం కొనసాగుతోంది. ప్రాజెక్టులో భాగమైన ఎల్లూరులోని మొదటి పంపు హౌజ‌్‌లో.. రెండున్నరేళ్ల క్రితం ముంపునకు గురై దెబ్బతిన్న రెండు మోటార్లు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. వానాకాలంలో శ్రీశైలం వెనక జలాల్లో వరదనీరు వచ్చినప్పుడు ఆ నీటిని ఎల్లూరు పంపు హౌజ్‌లోని ఐదు మోటార్లతో ఎత్తిపోస్తారు.
మోటార్ల మొరాయింపుతో రైతుల్లో ఆందోళన : ఎల్లూరు జలాశయంలో నీటిని నింపడం ద్వారానే గద్వాల మినహా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తాగునీరు అందిస్తారు. వరద ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోస్తేనే చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించడం సాధ్యమవుతుంది. మోటార్ల సామర్థ్యం తగ్గడం వల్ల ఎక్కువ మొత్తంలో నీటిని పంపు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం పెద్దగా వానల్లేకపోవడంతో.. కృష్ణానదిలో ప్రవాహం లేదు. శ్రీశైలం జలాశయంలో నీళ్లూ లేవు. ఒకవేళ వరద వస్తే ఎత్తిపోసుకునేందుకు మోటార్లు సిద్ధం చేయాల్సి ఉన్నా.. ఉన్న మూడు మోటార్లతోనే నెట్టుకొస్తున్నారు. 1, 2, 4 పంపుల ద్వారానే నీటి ఎత్తిపోత చేపట్టనున్నారు. 3, 5వ మోటార్ల మొరాయింపుతో వానాకాలంలో సాగునీటి ఎత్తిపోతపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
"5మోటార్లతో ప్రాజెక్టు ప్రారంభించారు. కృష్ణనది బ్యాక్ వాటర్ లో మోటార్లు మునిగిపోయాయి. కానీ చివరి ఆయకట్టు వరికి నీరు అందిస్తామంటున్నారు. ఉన్న మోటార్లు సరిగ్గా లేకుంటే నీరు ఎలా అందిస్తారు. చివరి ఆయకట్టుకు నీరు అందిన సరిపడ అందవు అలాగా రైతులు నష్టపోతారు."-శ్రీనివాసరావు, రైతు.
రక్షణ ఏర్పాట్లకు ప్రతిపాదనలున్నా నేటికీ నోచుకోలేదు : మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంప్ హౌస్.. మొదట 2014... ఆ తర్వాత 2020లో ముంపునకు గురైంది. మూడో పంపు మోటారు పూర్తిగా దెబ్బతినగా... ఐదో మోటారు సాంకేతిక సమస్యలతో పని చేయడం లేదు. వీటి మరమ్మతులకు ఏడాది కిందటే రూ.15 కోట్లు కేటాయించారు. ఇప్పటికీ 3వ మోటారు మరమ్మతులు కొనసాగుతూనే ఉండటం గమనార్హం. పంపుహౌజ్ ముంపునకు గురికావడానికి ప్రధాన కారణం.. వరద తాకిడికి గేట్లు దెబ్బతినడమే. ఈ నష్ట నివారణ కోసం రక్షణగేట్లు ఏర్పాటు చేయాలని 2015-16లోనే ప్రతిపాదనలున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
"రిపేరు చేయకపోతే వెసుకున్న పంట ఎండిపోవడం ఇలా జరుతుంది రైతులు చాలా నష్టపోతారు. ఐదు మోటార్లు సరిగ్గా పని చేస్తేనే కల్వకుర్తి వరకు నీరందుతాయి. ఉన్న మోటార్లు నడవడం వల్ల అన్ని ఆయకట్టులకు నీరు సరిగ్గా అందడం లేదు. యాసంగి పంట నీరులేక నష్టపోయాం. ఈసారి కూడా మోటార్లు ఇలానే నడుస్తే ఈ సీజన్ పంటను కూడా నష్టపోతాం."-పరశురాం, రైతు.
అధికారులు మాత్రం ఉన్న మోటార్లతోనే కేఎల్ఐ ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు నాటికి రెండు పంపుల ద్వారా తాగునీటి కోసం నీళ్లను ఎత్తిపోసేందుకు పనులు జోరుగా సాగుతున్నాయి. అది విజయవంతమైతే... కేఎల్ఐ-మోటార్ల మరమ్మత్తులపై దృష్టి సారించి రెండు మోటార్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ ఇంజినీర్ వెల్లడించారు.
"కేఎస్ఐలో రెండు పంపులు రిపేర్లో ఉన్నాయి. రెండు ఒక నెలలోపు రిపేర్ అవుతాయి. రంగారెడ్డి, పాలమూరుకి తాగునీరు అందిస్తున్నాం కాబట్టి రిపేర్ చెయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నీరు అకస్మాత్తుగా వచ్చినా మనం 3మోటార్లు నడిపించవచ్చు."-శ్రీనివాస్, డిప్యూటీ ఇంజినీర్.
మోటార్ల మరమ్మత్తులతో పాటు ప్రధాన కాల్వ, డిస్టిబ్యూటరీలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటి మరమ్మత్తులు చేపట్టడం ద్వారా... చివరి అయకట్టు కల్వకుర్తి నియోజకవర్గం వరకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: