kalthi kallu deaths in mahabubnagar: కల్తీకల్లు సేవిస్తూ వింత ప్రవర్తనతో మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడటం జిల్లాలో కలకలం రేపుతోంది. గత ఐదు రోజులుగా వింత ప్రవర్తన, కాళ్లు చేతులు వంకర్లు పోవడం, వాంతులు, ఫిట్స్, పాక్షిక అపస్మారక స్థితి లాంటి లక్షణాలతో 12 మంది ఇన్ పేషెంట్లుగా, 30కి పైగా మంది అవుట్ పేషెంట్లుగా చేరారు.
మహబూబ్ నగర్ జిల్లా కోడెరుకు చెందిన ఆశన్న, జిల్లా కేంద్రానికి చెందిన విష్ణుప్రకాశ్ అనే ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతూ మృతిచెందడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆశన్న ఆదివారం చనిపోగా, విష్ణు నిన్నరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ క్రమం తప్పకుండా పట్టణంలోని కల్లు కాంపౌండ్లలో కల్లు సేవించే వాళ్లు. కల్లులో కలిపే మత్తు మోతాదుల్లో తేడాల కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
ఇద్దరి మరణానికి కల్తీ కల్లే కారణమనే ఆరోపణలున్నాయి. వైద్యులు మాత్రం మెటాబాలిక్ ఎన్క్లియోపతి అంటే కీలకమైన అవయవాలు విఫలం కావడం వల్ల మృత్యువాత పడ్డట్లుగా చెబుతున్నారు. ఆల్కహాలిక్ విత్ డ్రావల్ సిండ్రోమ్ లక్షణాలున్నా ఏ తరహా ఆల్కహాల్ సేవించారని చెప్పలేమని మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ వెల్లడించారు. శవపరీక్ష సహా ఫోరెన్సిక్ నివేదికలు అందితేనే మరణానికి కారణాలు తెలుస్తాయని చెప్పారు.
నేతల ఆగ్రహం: ప్రస్తుతం ఇద్దరు ఐసీయూలో, ఇద్దరు జనరల్ వార్డుల్లో అవే లక్షణాలతో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే కల్తీ కల్లుకారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించాయి. వారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోతే మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ హెచ్చరించారు. జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని భాజపా జిల్లా అద్యక్షుడు వీరబ్రహ్మచారి పరామర్శించారు. సూపరింటెండెంట్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత జిల్లాలో కల్తీకల్లు రాజ్యమేలుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు.
కొనసాగుతున్న చికిత్స: మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నారు. కల్తీ కల్లు కారణంగా సుమారు 40 మంది బాధితులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అయితే వారిలో ప్రస్తుతం ఇద్దరు మృత్యు వాత పడ్డారు.
ఇవీ చదవండి: