పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు ఈ నెల 15న సామాజిక సర్వే నిర్వహించింది. గ్రామానికి చెందిన కొంతమంది దళారులుగా మారి... పరిహారం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి దందా చేస్తున్నారు. గ్రామంలో ఉండేవారికే కాకుండా... ఇతర గ్రామాల్లో నివసించే వారి బంధువులకు కూడా ఇప్పిస్తామని మాయమాటలు చెప్తున్నారు. అందుకోసం గుడిసెలు, ఇల్లు రాత్రికి రాత్రే నిర్మిస్తున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం... ప్రతి ఇంటికి రూ.12 లక్షలు ఇవ్వనున్నారు. దీంతో లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించొచ్చని భావిస్తున్నారు. దాదాపు 40 ఇళ్లు నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా... పట్టించుకున్న నాథుడే లేడు. ఈ విషయంపై తహసీల్దార్ లక్ష్మీనారాయణను వివరణ కోరగా... 2016 నోటిఫికేషన్ తర్వాత కట్టిన ఇళ్లకు ఎట్టిపరిస్థితుల్లో పరిహారం రాదని స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. మాయమాటలు చెప్పి అమాయకులను మోసం డబ్బులు వసూలు చేస్తే... చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆ ఊళ్లో విందు భోజనమంటే.. గడ్డికూర ఉండాల్సిందే!