Heavy rains in Mahbubnagar: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షం మరోసారి బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రామయ్యబౌలి, శివశక్తి నగర్, బీకే రెడ్డి కాలనీ, భగరీథ కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరటంతో చేరింది. పాలమూరు పట్టణం నుంచి వచ్చే వరద నీరంతా పెద్దచెరువులో చేరకుండా నేరుగా కాల్వల ద్వారా బయటకు పంపుతుండటంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ఫలితంగా ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఇళ్లలోకి వచ్చిన వరద నీరు: మూడు నాలుగు రోజుల క్రితం 10 సెంటీమీటర్ల కంటే అధికంగా వాన పడటంతో వరద పోటెత్తింది. మరోసారి అదేపరిస్థితి రావటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామయ్యబౌలీని సందర్శించేందుకు వచ్చిన మున్సిపల్ ఛైర్మన్ నర్సింహులును స్థానికులు అడ్డుకున్నారు. ముంపు సమస్యకు పరిష్కారం చూపడం లేదంటూ ట్యాంక్ బండ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకు ఆందోళన విరబించబోమన్నారు. నేతలు, ఉన్నతాధికారుల మాటలు హమీలకే పరిమతం అవుతున్నాయని వ్యాఖ్యానించారు.
మదనాపురం- ఆత్మకూరు బ్రిడ్జిపై భారీగా వరదనీరు: ఎగువన కురుస్తున్న వర్షాలకు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వస్తోంది. దీంతో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. 3వేల600 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళ సాగర్ ప్రాజెక్టు ఆటోమెటిక్ సైఫాన్లు తెరచుకోవడంతో దిగువన ఉన్న మదనాపురం- ఆత్మకూరు బ్రిడ్జిపై భారీగా వరద పారుతోంది. దీంతో మరోసారి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వానాకాలంలో సరళాసాగర్ సైఫన్లు తెరచుకోవడంతో ఇది పదకొండో సారి కావటం విశేషం.
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న జెర్రిపోతుల వాగు: వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో ఊరచెరువు తెగిపోయింది. జగత్ పల్లి సమీపంలో ఉన్న కాజ్‌వేపై ఉదృతంగా నీరు ప్రవహిస్తుండడంతో పెద్దమందడి మండలం నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. జెర్రిపోతుల వాగు ఉద్ధృతంగా ప్రవహించి వంతెన పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. వనపర్తి- గోపాల్ పేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.నాగర్ కర్నూల్‌లోని ఎడతెరపిలేని వర్షాలకు పలుకాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
ధన్వాడ మండలంలో నిలిచిన రాకపోకలు: దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఆరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లాపూర్‌లో నార్లాపూర్, ముక్కిడి గుండం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడలో 10 సెంటీమీటర్లు, మరికల్ మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధన్వాడ మండలంలోని మందిపల్లి, యమునోనిపల్లి వాగులు ఉధృతంగా ప్రవహించి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. మందిపల్లి పాతతండాలోని లోతట్టు నివాస గృహాలలోకి వరదనీరు చేరింది.
సాగర్ ప్రాజెక్టుకు 3 వేల 600క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద నీరు: గంటల తరబడి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు మత్తడి దుంకతున్నాయి. దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. 3 వేల 600క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కాగా.. ఐదు గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తి 3 వేల 500 క్యూసెక్కుల వదులుతున్నారు. నారాయణపేట జిల్లాలోని మరికల్ పట్టణంలోని బీసీ కాలనీ జలమయం అయ్యింది. మరికల్-కన్నునూరు, పాత పల్లి, యమునోని పల్లి, మందిపల్లి నుంచి ధన్వాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవీ చదవండి: