ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు గద్వాల పట్టణం అతలాకుతలం అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత వారం రోజులుగా కురుస్తున్న వానలతో గద్వాల తడిసిముద్దయింది. గద్వాల-రాయచూర్ రహదారిపై వంతెన నీటిలో కొట్టుకుపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. రాయచూర్ నుంచి గద్వాలకు వెళ్తున్న లారీ వాగులో పడిపోయింది. నందిన్నె వాగు దగ్గర తాత్కాలికంగా వేసిన రోడ్డు మళ్ళీ తెగి పోయింది. గద్వాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులను ఎమ్మెల్యే కృష్ణమోహన్ పరామర్శించారు.
నిలిచిపోయిన రాకపోకలు...
దేవరకద్ర నియోజకవర్గంలో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతూ పంటలు నీటమునిగాయి. రహదారులు ధ్వంసం కావడం వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కౌకుంట్ల గ్రామంలో కుంటలు తెగిపోవడం వల్ల కౌకుంట్లతోపాటు రాజోలి వెంకటగిరి, రేకులంపల్లి తదితర గ్రామాల్లో 2 వేల ఎకరాల పత్తి పంట నీట మునిగింది. చింతకుంట మండలంలో ముత్యాల చెరువుకు గండిపడి పలు గ్రామాలు జలమయం అయ్యాయి. అడ్డాకుల, మూసాపేట, భూత్‌పూర్ మండలాల్లోనూ వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఉప్పొంగిన వాగులు...
వనపర్తి జిల్లా పెద్దమందడి, ఖిల్లా ఘణపురం మండలాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వెల్టూరు సమీపంలో రహదారిపై భారీగా వరదనీరు చేరింది. మోజెర్లలో ఇళ్లలోకి నీరు చేరింది. చెరువులు అలుగు పారడం వల్ల పలు గ్రామాల్లో పంట నీట మునిగింది.
మోకాళ్ల లోతు వరద
అచ్చంపేట నియోజకవర్గంలోనూ కుండపోత వర్షం కురిసింది. కాలనీల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరదనీరు ప్రవహించింది. అంబటిపల్లి-యాపట్ల గ్రామాల మధ్య వంతెనపై నీరు పొంగిపొర్లడం వల్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
ఆర్డీఎస్‌కు గండి
కర్నూల్-రాయచూర్ రహదారిలో బొంకూరు వాగుపై తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు భారీ వర్షానికి తెగిపోయింది. ఈ తరుణంలో ఆ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటిక్యాల మండలం సాతర్లలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మానవపాడు వద్ద ఆర్డీఎస్‌కు గండి పడటం వల్ల పంటలు నీటమునిగాయి.
ఇదీ చూడండి : పంచాయతీలో అవినీతిపై దీక్ష.. భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం