Harish Rao Comments: భాజపా నాయకులు 317 జీవోను రద్దు చేయమంటున్నారని.. ఇది వద్దంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దనడమేనని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆసుపత్రి భవనాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. 317 జీవో అమలైతే.. ఖాళీగా ఉన్న ప్రాంతాలకు నోటిఫికేషన్లు ఇస్తామని.. దీంతో రాష్ట్రంలో 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దొరుకుతాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. పేద యువతకు ఉద్యోగాలు రావొద్దనేది భాజపా నేతల ఉద్దేశమని అందుకే .. జీవోకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని హరీశ్ ఆరోపించారు.
ఉద్యోగాలు రావొద్దనే..
"317 జీవో అమలైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 60, 70 వేల ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఇందుకోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వెనుకబడిన జిల్లాలకు ఉద్యోగాలు దక్కాలని 317 జీవోను అమలు చేస్తున్నాం. కానీ.. పేదలకు ఉద్యోగాలు రావొద్దనేదే భాజపా నేతల ఉద్దేశ్యం. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుకూలంగానే విడుదలైన ఈ జీవోకు వ్యతిరేకంగా భాజపా పోరాడుతోంది. నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే.. దేశంలో ఖాళీగా ఉన్న 10 లక్షల 62 వేల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలి. అవి భర్తీ చేయకుండా పేదలకు, నిరుద్యోలకు అన్యాయం చేస్తున్నారు. పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే భాజపా నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తీసుకురావాలి." - హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
అభివృద్ధి చూసి ఓర్వలేక..
రాష్ట్రంలో అభివృద్ది చూసి తెలంగాణలో ఎందుకు పుట్టలేదా అని పక్క రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇప్పటి వరకు పాలించిన జాతీయ పార్టీలు అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ది జరుగుతుంటే అన్ని రంగాల ప్రజలు తిరిగి తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. ఇతర పార్టీల వారు అది ఓర్వలేక.. గగ్గోలుపెడుతున్నారని విమర్శించారు.
"ఇప్పటి వరకు ఇతర ప్రభుత్వాల పాలనలో మోసపోయాం. సీఎం కేసీఆర్ హయాంలో ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా బలపడాలి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరగతిన పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయలనుకున్నాం. కానీ.. ఈ ప్రాంతంలో ఉన్న కొందరు నాయకులు కేసులు వేసి అడ్డుకోవడం వల్ల ఆలస్యమైంది. తొందర్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలను ససశ్యామలం చేస్తాం. గతంలో తండాలు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా తాగునీరు, విద్య ,వైద్యం కోసం ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ వచ్చాక ఎంతో ప్రగతిని సాధించాం. ఏడేళ్లలో తీసుకువచ్చిన అభివృద్ధితో అందరం సంతోషంగా ఉంటున్నాం." - శ్రీనివాస్‌గౌడ్, అబ్కారీ శాఖ మంత్రి
ఇదీ చూడండి: