Mahabubnagar Groundnut Price: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్న ప్రభుత్వ సూచన మేరకు యాసంగిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు అధికంగా వేరుశనగ వైపు మొగ్గు చూపారు. ఈ యాసంగిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ 2 లక్షల 20 వేల ఎకరాల్లో సాగైంది. గతేడాది సాగుతో పోల్చుకుంటే సుమారు 70 వేల ఎకరాలు రైతులు అధికంగా సాగు చేశారు. కాని వేరుశనగ సాగు చేసిన రైతులకు ఈ సీజన్ నిరాశే మిగిల్చింది. తెగుళ్ల దాడి అధికమై దిగుబడులు పడిపోయాయి. తెగుళ్ల నివారణ కోసం పురుగు మందులు అధికంగా వాడటంతో పెట్టుబడులు సైతం పెరిగాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్లే దిగుబడులు తగ్గిపోయాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాణ్యమైన పల్లికి మార్కెట్లో మంచి ధరలే దక్కుతున్నాయని, నాణ్యత లేని పల్లికి సరైన ధర దక్కడం లేదని అధికారులు చెబుతున్నారు.
జిప్సం వాడితే..
'పల్లి పూతకు వచ్చినప్పుడు జిప్సం వేయమని చెబుతాం. జిప్సం వేయడం వల్ల కాయలు మంచిగా వస్తాయి. కానీ రైతులు జిప్సం వాడరు. జిప్సం వాడితే 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి పెరుగుతుంది. జిప్సం వాడినవాళ్లకు 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాడని రైతులకు 10 -12 క్వింటాళ్లు వచ్చింది.' - వెంకటేశ్, మహబూబ్ నగర్ జిల్లా ఇంఛార్జ్ వ్యవసాయశాఖ అధికారి
కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావు
ప్రస్తుతం మార్కెట్లో పల్లికి పలుకుతున్న ధరలు చూసి రైతులు లబోదిబోమంటున్నారు. గరిష్ఠ ధరలు 6,500 వరకు పలికినా ఒక్కరో ఇద్దరికో దక్కుతున్నాయని ఎక్కువమందికి 3 వేల నుంచి నాలుగున్నర వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత, తేమశాతం, తాలు పేరిట వ్యాపారులు తక్కువ ధరలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవే మార్కెట్లలో వారం పది రోజుల కిందట గరిష్ఠంగా 7- 8 వేలు పలికిన పల్లికి ఒక్కసారిగా ధరలు పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలే కొనసాగితే తమకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావని వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీసంగా ఆరేడు వేలు క్వింటాలుకు చెల్లిస్తే తప్ప రైతులకు ప్రస్తుతం గిట్టుబాటు కాదని అంటున్నారు.
మాకు మిగిలింది ఏం లేదు
'ఇక్కడ ఇచ్చే రేటుతో మాకు మిగిలింది ఏం లేదు. ప్రభుత్వమే కొంటదని రైతు వేదికల వద్ద ఫారాలు నింపించారు. కానీ కొనలేదు. ఇక్కడ గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి వరకు వచ్చింది. ఫస్ట్ 8 వేల వరకు పోయింది. మేము వచ్చే సరికి రూ.5వేల నుంచి 4వేల వరకు పోతుంది. రూ.10వేల వరకు లాస్ వస్తోంది. ప్రభుత్వం రూ.6వేల వరకు కొంటే గిట్టుబాటు అయ్యేది.' - శ్రీనివాస్ రెడ్డి, వేపూర్ వేరుశనగ రైతు
పంట ఎక్కువ వచ్చిందని తక్కువ ధర
'నేను ఎకరంన్నర పల్లి వేశాను. విత్తనాలు క్వింటాకు రూ.12వేలు పెట్టి కొన్నా. 40వేల వరకు పెట్టుబడి పెట్టాం. కానీ ధరలు చాలా తక్కువకు పోతున్నాయి. క్వింటాకు రూ.6 వేలు వస్తేనే మాకు ఏమైన లాభం ఉంటది. పంట ఎక్కువ వచ్చిందని తక్కువ ధరకు కొంటున్నారు. అలా చేయడం వల్ల రైతులు చాలా నష్ట పోతున్నారు. మద్దతు ధర వేయడం లేదు.' -వెంకట్రాములు గౌడ్, వేరుశనగ రైతు
అలా ఉండే కనీస మద్దతు ధర
అంతర్జాతీయ ఎగుమతులు, జాతీయ మార్కెట్ ధరల ఆధారంగానే ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని వాటి ఆధారంగా కొనుగోలు చేస్తామని వ్యాపారులు అంటున్నారు. పంట నాణ్యంగా ఉండే కనీస మద్దతు ధర చెల్లిస్తున్నామని చెబుతున్నారు. గతంతో పోల్చితే ఈసారి మార్కెట్లకు వేరశనగ అధికంగా వస్తోందని, నాణ్యమైన పల్లికి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు గతంలో 29వేల క్వింటాళ్ల పల్లి వస్తే ఈసారి లక్షా 48 వేల క్వింటాళ్లు ఇప్పటి వరకు వచ్చిందని, ఆలస్యంగా సాగు చేయడం వల్ల మరో రెండు నెలల వరకు పల్లి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మంచి గ్రేడ్లో తీసుకొస్తే..
'గతేడాది కంటే ఈసారి పల్లి పంట సాగు పెరిగింది. దాదాపుగా రెండు నెలల నుంచి పంట మార్కెట్కు వస్తోంది. రూ.5,550 గిట్టుబాటు ధర. తాలు లేకుండా... మట్టిలేకుండా పంట తీసుకొస్తే ధర ఎక్కువ ఇప్పించేలా ప్రయత్నిస్తున్నాం. పంట బాగా లేనప్పుడు ధర కొంచెం తగ్గింది. మంచి గ్రేడ్లో తీసుకొస్తే ఎక్కువ ధర వస్తుంది.' - సారిక, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి
డిమాండ్ ఆధారంగా ధరలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, బాదేపల్లి, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, గద్వాల సహా వివిధ మార్కెట్లలో ప్రస్తుతం ధరలు గతంలో పోల్చితే వెయ్యి నుంచి 2వేల వరకు పడిపోయాయి. మార్కెట్లకు పల్లి రాక పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు, జాతీయ మార్కెట్లో డిమాండ్ ఆధారంగా ధరలు పడిపోతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు . రైతులు మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుని కనీస మద్దతు ధర రూ.5500 అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఆ ఇద్దరి సంకల్పమే... హమారా భారత్ బయోటెక్ మహాన్..