ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా ఫిల్టర్ ఇసుకదందా సాగుతోంది. వాగులకు అనుకుని ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో ఫిల్టర్ ఇసుక కేంద్రాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్, రాజాపూర్, నవాబుపేట, జడ్చర్ల, మిడ్జిల్, మహబూబ్‌నగర్, హన్వాడ, భూత్పూరు, అడ్డాకల్, మూసాపేటల్లో వాగులు, ఇసుక పొలాలున్న ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తున్నారు.
జడ్చర్ల మండలంలో ఉదండపూర్ జలాశయం కోసం తవ్విన గుంతల్లో ఇటీవల భారీగా ఊటనీరు చేరింది. ఈ నీటిని కొందరు ఫిల్టర్ ఇసుక కోసం వినియోగిస్తున్నారు. మట్టి ఇసుకతో నింపిన ట్రాక్టర్లు, టిప్పర్లను అక్కడకు తీసుకువచ్చి ఇసుకను ఫిల్టర్ చేస్తున్నారు. నిత్యం 30 నుంచి 40 వాహనాల ఇసుకను ఫిల్టర్ చేసి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ. 3 వేల నుంచి 5 వేలు
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గంగారం, లట్టుపల్లి, మహదేవుని పేట, నక్కలచెరువు, ఊడ్గులుకుంట, చిన్నపీర్ తండాల్లోనూ ఫిల్టర్ ఇసుక కేంద్రాలున్నాయి. ఇసుక లభ్యత, డిమాండ్‌ను వారి వ్యాపారం మూడుపూలు ఆరుకాయలుగా నడుస్తోంది. వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట, రేవల్లి మండలాల్లోనూ ఫిల్టర్ ఇసుక దందాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. వాగులు, వంకలు, ఇసుక మేటలున్న పొలాల్ని అక్రమార్కులు తొలత గుర్తిస్తారు.
మట్టితోపాటు ఇసుకను తవ్వి ట్రాక్టర్లు లేదా టిప్పర్లలో నింపుతారు. ఇసుక నుంచి మట్టిని వేరు చేసేందుకు తీవ్ర ఒత్తిడితో నీటిని పంప్ చేస్తారు. నీటి తాకిడికి మట్టి కిందకు జారిపోతుంది. అలా పలుమార్లు నీటితో ఇసుకను కడిగేస్తారు. మట్టి మిగిలిపోయిందని భావిస్తే జల్లెడ పడతారు. చూడ్డానికి నాణ్యమైన ఇసుకలా కనిపించే వరకూ ప్రక్రియ కొనసాగుతుంది. అలా వచ్చిన ఇసుకను వినియోగదారులకు అమ్మేస్తారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 3,500 నుంచి రూ. 5 వేల వరకూ పలుకుతోంది.
నిబంధనలకు విరుద్ధం...
వాల్టా చట్టం ప్రకారం ఫిల్టర్ ఇసుక కేంద్రాలను నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. ఎలాంటి అనుమతులు లేకుండానే రైతులకు ట్రాక్టర్‌కు ఐదారొందలు ముట్టజెప్పి మట్టిని తవ్వేసుకుంటున్నారు. నీళ్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మోటార్లతో నీటిని తోడి ఇసుకను ఫిల్టర్ చేస్తారు. అలావచ్చిన ఇసుకను డంపులుగా పోసి రాత్రికి రాత్రికి లక్షిత ప్రదేశాలకు తరలిస్తారు. ఇంత దందా జరుగుతున్నా అలాంటి తమ దృష్టికి రాలేదంటున్న అధికారులు ఫిల్టర్ ఇసుక కేంద్రాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఫిల్టర్ ఇసుకలో మట్టి, దుమ్ముశాతం అధికంగా ఉండటం వల్ల సిమెంట్‌తో కలిపినప్పుడు ఆ మిశ్రమం బలంగా ఉండదు. అలాంటి వాటితో నిర్మాణాలు నాసిరకంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: సామూహిక పంచాంగ శ్రవణం వద్దు.. నిరాడంబరంగానే ఉగాది వేడుకలు