తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తుంగభద్ర పుష్కరాలు వచ్చాయని... దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని భాజపా జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కోటి దేవతలు కొలువై... సకల పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసించే ఈ వేడుక పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం అవమానకరమన్నారు.
కేసీఆర్ హిందువులు, హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయాల పట్ల చులకనగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం రాజకీయం చేస్తూ.. ఎంఐఎంతో పొత్తుపెట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు.
ఈనెల 20 నుంచి ప్రారంభమై... డిసెంబరు 1వ తేదీ వరకు జరగనున్న ఈ పుష్కరాల దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటివరకు కనీస ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా తుంగభద్ర పుష్కరాల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసి, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని... లేనిపక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల్లో పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్