మహబూబ్‌నగర్- రాయిచూర్ 167వ జాతీయ రహదారి ఏర్పాటుకు చేపట్టిన సర్వే కాకుండా ప్రత్నామ్నాయా మార్గాలను చూడాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ సమీకృత భవనానికి 500 మీటర్ల దూరం నుంచి వెళ్లే విధంగా సర్వే చేపట్టడం వల్ల ప్రైవేటు, వ్యవసాయ భూములు పోతున్నాయన్నారు.
భవిష్యత్తులో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం మరింత విస్తరిస్తే ఈ రహదారి పట్టణానికి అత్యంత చేరువవుతుందన్నారు. ప్రజలు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా నిర్మించే భారత్‌మాలా రహదారిని భూత్పూర్ మండలం పోతులమడుగు నుంచి నేరుగా ధర్మాపూర్‌కు అనుసంధానించే అవకాశం ఉందన్నారు.
కేవలం ప్రభుత్వ భూములగుండా రహదారిని ఏర్పాటు చేసే వీలుందని.. దాంతో దూరం కూడా తగ్గుతుందని ఆ విధంగా సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశం పూర్తి సమాచారంతో కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.