పంట అమ్మకాల సీజన్ ప్రారంభమైంది. ఇంకొన్ని రోజులైతే ఊళ్లకు వెళ్లే రోడ్లపై పంటలు ఆరబోసిన దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. రైతులు పండించిన పంటల్ని రోడ్లమీదే ఆరబోస్తుంటారు. ఉపాధిహామీ పథకం కింద రాయితీపై రైతులు తమ పొలాల వద్దే కల్లాలు నిర్మించేందుకు అవకాశం ఉన్నా.... కల్లాల నిర్మాణాలు ముందుకు సాగకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది (threshing floor construction). ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 13వేల కల్లాల నిర్మాణాలకు 100కోట్ల రూపాయల అంచనాలతో ఉపాధిహామీ కింద పనులు మంజూరయ్యాయి. కానీ వీటిలో కేవలం 648 మాత్రమే పూర్తయ్యాయి. కేవలం 4కోట్ల 42 లక్షలు మాత్రమే ఉమ్మడి జిల్లాలో ఖర్చు చేశారు. మరో 7కోట్ల 25లక్షల విలువైన.... 2,745 కల్లాల పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన కల్లాల పనులు అంచనాల వద్దే ఆగిపోయాయి. అయితే కల్లాలు నిర్మించుకున్న రైతులు తమకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
12 ఎకరాల్లో వరిసాగు చేస్తుంటాం. గతంలో వరిపంట వేసిన తర్వాత కోయాలంటే చాలా భయం వేసేది. కోసిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి, ఎక్కడికి తీసుకుపోవాలి..? ఏమి చేయాలోనని భయం వేసేది. ఎక్కడైనా అడితిలో వేద్దామంటే కవర్లు తీసుకురమ్మని చెప్పేవారు. అటువంటి పరిస్థితిలో ఈ కల్లం వచ్చిన తర్వాత ధాన్యం ఎండబెట్టాలంటే మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడైనా వర్షం వస్తుందనుకుంటే ఓ కవర్ తెచ్చి కప్పితే సరిపోతుంది. ఇంతకుముందు కిందో కవరు, మీదో కవరు వేయాల్సి వచ్చేది. అయినప్పటికీ పంట పాడైపోయేది. ఈ కల్లం వేసుకున్న తర్వాత చాలా ఉపయోగకరంగా ఉంది. -రైతు, పెద్దమందడి మండలం
ఈ కల్లాల వల్ల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. వడ్లు, గింజలు ఆరబెట్టుకోడానకి మంచిగా పనిచేస్తుంది. నేను కూడా కల్లం నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాను. ఈ కల్లం రైతులకు అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. -చంద్రు, రైతు
ఆసక్తి చూపని రైతులు
జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించే వ్యవసాయ కల్లాలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి రాయితీ లభిస్తుంది. 33 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుగా నిర్మించే కల్లాలకు మొత్తం 85వేలు ప్రభుత్వమే అందిస్తుంది. బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులు ప్రభుత్వమిచ్చే మొత్తంలో 10శాతం వాటాధనంగా ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఐదెకరాల లోపు వ్యవసాయ భూములున్న చిన్న, సన్నకారు రైతులకే ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ ఎకరా, రెండెకరాలున్న రైతులు కల్లాల నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు. కల్లానికి స్థలం కేటాయించే బదులు సాగు చేస్తే లాభమనే ఆలోచన వారిలో ఉంది. దీంతో లక్షిత లబ్ధిదారులకు పథకం చేరే అవకాశంలేకుండా పోతోంది.
ఇవీ సమస్యలు
ఈ పథకంపై రైతుల్లో సరైన అవగాహన లేకపోవటం ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవటానికి కారణమవుతోంది. పెట్టుబడులు పెట్టి కల్లాలు పూర్తి చేసినా... వారికి సరైన సమయానికి బిల్లులు రావడం లేదు. దీంతో మిగిలిన రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని చిన్నసన్నకారు రైతులు కల్లాలకు దూరమవుతుండగా.... స్థలాభావంతో కొందరు ఆసక్తి చూపడం లేదు. రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఆర్థిక సమస్యలు ఇతర కారణాలతో ముందుకు రావడం లేదని ఉపాధిహామీ పథకం సిబ్బంది చెబుతున్నారు.
పెద్దమందడి మండలంలో ఉపాధిహామీ పథకం కింద దాదాపు 180 కల్లాలు మంజూరయ్యాయి. అందులో 30 మాత్రమే అతి కష్టం మీద పూర్తిచేయగలిగాం. త్వరలోనే మిగతావాటిని నిర్మించాలని అనుకుంటున్నాం. మూడు రకాల కల్లాలు ఉన్నాయి. రూ.50, 60,85 వేలు చొప్పున కల్లం నిర్మాణాలు ఉన్నాయి. ఈ కల్లాల ఉపయోగాల గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాము. ఈ కల్లాలు అందరూ వేసుకోవచ్చు. ఎస్సీ,ఎస్టీలకు పూర్తి సబ్సిడీపై నిర్మిస్తారు. బీసీ, ఇతరులు 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మెత్తాన్ని కూడా పనిలో తగ్గిస్తాం.
-సత్తెన్న, సాంకేతిక సహాయకుడు, పెద్దమందడి మండలం
ప్రభుత్వం స్పందించకుంటే అదే పరిస్థితి
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కల్లాల నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకుంటేనే నిర్ణీత నిబంధనల మేరకు ధాన్యం, ఇతర పంటలు మార్కెట్ లోకి చేరే అవకాశం ఉంది. లేదంటే ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రోడెక్కక తప్పని పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి: తరుగు పేరుతో నిలువు దోపిడీ.. వ్యాపారులు చెప్పిందే ధర...!