Digital Crop Survey in Telangana : తెలంగాణలో వ్యవసాయశాఖ చేపడుతున్న పంటల నమోదు ప్రక్రియ తరహాలోనే దేశవ్యాప్తంగా డిజిటల్‌గా పంటల సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ ఖరీఫ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ముందుగా 12రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ పంటల సర్వేను చేపట్టనున్నారు. సర్వే చేసేందుకు రూపొందించిన యాప్ పనితీరును పరీక్షించేందుకు ప్రూఫ్ అఫ్ కాన్సెప్ట్ - పీఓసీ కింద 12రాష్ట్రాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లా వెంకటాపూర్ గ్రామం పీఓసీకి ఎంపికైంది.
Crop Survey based on Tracking System in Telangana : ఈ మేరకు నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం గ్రామంలో స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి నమూనా సర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ అప్లికేషన్‌లో నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడ ఏ పంట వేశారో ఫోటో తీసి సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు భూరికార్డుల నుంచి ఏ సర్వే నంబర్‌లో, ఏ రైతుకెంత భూమి ఉంది.. అది ఎక్కడుందన్న సమాచారాన్ని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టింతో అనుసంధానం చేశారు. పంటల సర్వే పక్కాగా జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని బృంద సభ్యులు చెబుతున్నారు.
venkatapur digital crop survey in Mahabubnagar : 12రాష్ట్రాల్లో ఒక్కో గ్రామంలో పీఓసీ కింద యాప్ పనితీరును పరీక్షించిన తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులు చేసి ఈ ఖరీఫ్ సీజన్‌లో 12రాష్ట్రాల్లోని 20శాతం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా పంటల సర్వే అమలు చేయనున్నారు. తెలంగాణ సహా 4రాష్ట్రాల్లో ఇప్పటికే పంటల నమోదు ప్రక్రియ అమల్లో ఉంది. అందుకోసం రాష్ట్రప్రభుత్వాలకు ప్రత్యేకంగా యాప్‌లున్నాయి. కేంద్రం నిర్వహించే పంటల సర్వేకు రాష్ట్రాల యాప్‌లో మార్పులు చేసుకుని వాడుకోవచ్చని, లేదంటే కేంద్రం రూపొందించిన యాప్‌ని నేరుగా వాడుకోవచ్చని కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పంటల నష్టం, బీమా, రాయితీపై ఎరువులు, పంట సేకరణ లాంటి పక్రియల్లో నేరుగా రైతుకు లబ్ది చేకూర్చేందుకు సర్వే సమాచారం తోడ్పడుతుందంటున్నారు.
"ఈ సర్వే కోసం 12 రాష్ట్రాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేశాం. పైలట్ ప్రాజెక్ట్ చేసే ముందు పీఓసీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. మేము యాప్‌ని టెస్ట్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర క్రాఫ్ బుకింగ్ యాప్ ఇప్పటికే ఉంది. ఆ యాప్‌లో అడిషనల్ ఫ్యూచర్స్ని చేర్చుకుని వాడుకోవచ్చు. ఇది రైతులకు ఉపయోగపడుతుంది."- శ్రీనివాసులు, డీడీ, న్యూదిల్లీ, కేంద్ర వ్యవసాయశాఖ
lands survey: భూముల సమగ్ర సర్వే దిశగా సర్కారు కసరత్తు
Telangan digital crop Survey : కేంద్రం రూపొందించిన యాప్‌లో బై నంబర్లలో ఉన్న భూముల్లోనూ సాగవుతున్న పంటల ఫోటోలు కూడా నిక్షిప్తం చేయమంటున్నారని, క్షేత్రస్థాయిలో అది కష్టంతో కూడుకున్న పనిగా స్థానిక వ్యవసాయశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సర్వే చేసే భూమి దగ్గరకి వెళ్తేనే నమోదు ప్రక్రియ సాగటం, సాగులో ఉన్న భూమి నుంచి లక్షిత ప్రదేశానికి చేరుకుని ఫోటోలు తీసుకోవడం కష్టమవుతుందని చెబుతున్నారు. రాష్ట్ర సర్కార్ యాప్‌లో ఫోటోలు లేకున్నా.. కచ్చితమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నామని.. అందుకే పంటల సర్వేకు తెలంగాణ విధానం సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపూర్ తరహాలోనే మిగిలిన రాష్ట్రాల్లో పీఓసీ పూర్తైతే చేపట్టాల్సిన పైలట్ ప్రాజెక్టుపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. పంటల సర్వేపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు పూర్తైతే 12 రాష్ట్రాల్లో సాగు యోగ్యమైన భూముల్లో, 20శాతం గ్రామాల్లో డిజిటల్ సర్వే జరగనుంది.
ఇవీ చదవండి :