పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్‌రావు సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ రెవెన్యూ సమావేశ మందిరంలో ఆయన విద్యాశాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 15,108 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని.. ఇందు కోసం 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని సూచించారు.
అవసరమైనచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు తాగునీటి వసతి ఏర్పాట్లను చేయాలని సూచించారు. పరీక్షల నిమిత్తం నియమితులైన అధికారులు, సిబ్బంది విధులకు గైర్హాజరయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరీక్షల సమయంలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే కలెక్టరేట్ కాల్‌సెంటర్ 08542-241165కు సమాచారం అందించాలన్నారు. పరీక్ష రోజున విద్యార్థుల హాజరు నివేదికలను ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు. అనంతరం రవాణా, విద్యుత్తు, వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులకు పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
ఇవీచూడండి: తహసీల్దార్లతో మహబూబ్నగర్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్