BC MLA Ticket Issue in Mahabubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానపార్టీల టిక్కెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ముఖ్యంగా బీసీలకు న్యాయం చేయాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీలు ఆ దిశగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 14స్థానాల్లో బీజేపీ మొదటి జాబితాలో 2స్థానాలకు మాత్రమే అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. తొలి జాబితాలో మహబూబ్‌నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, గద్వాల నుంచి డీకే అరుణకు టిక్కెట్లు ఖరారు అవుతాయని భావించినా.. వారి పేర్లు జాబితాలో లేకపోవటం చర్చనీయంగా మారింది.
BJP MLA Ticket in Gadwal : గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన సరితకు టికెట్ కేటాయించగా.. బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. బీసీలను ప్రోత్సహించే దిశగా తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు డీకే అరుణ చెబుతున్నారు. అటు మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పోటీకి ఆసక్తి చూపకపోతే బీసీ అభ్యర్ధిని నిలపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ స్థానం కల్పించాలన్న యోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉందని తెలుస్తోంది.
BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్‌పై ఏఐసీసీ ఫైర్
Congress MLA Ticket in Gadwal : కాంగ్రెస్ పార్టీలోనూ టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలన్న డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలుండగా.. ఈ మూడింటిలో ఒక్కటైనా బీసీ కేటాయించాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. మహబూబ్‌నగర్ టికెట్ కోసం యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, ఒబేదుల్లా కొత్వాల్ పోటీ పడుతున్నారు. దేవరకద్ర, జడ్చర్ల స్థానాలను రెడ్డిలకు కేటాయిస్తే.. మహబూబ్‌నగర్‌ను బీసీ లేదా మైనారిటీలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. జడ్చర్ల టికెట్‌ను అనిరుధ్ రెడ్డి, ఎర్రశేఖర్ ఆశిస్తున్నారు. ఇక్కడ అనిరుధ్ రెడ్డికి ఇస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎర్ర శేఖర్‌కు నారాయణపేట ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అటు, దేవరకద్రలోనూ మధుసూదన్‌రెడ్డి, కొండా ప్రశాంత్ రెడ్డి ఆశిస్తుండగా.. మహబూబ్‌నగర్, జడ్చర్ల స్థానాలను రెడ్డిలకు కేటాయిస్తే, దేవరకద్రలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రదీప్ గౌడ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. నారాయణపేట జిల్లాలో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలున్నాయి. ఈ రెంటింటిలో ఒకటి బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్‌లో బలంగా ఉంది. మక్తల్‌లో రెడ్డి వర్గానికి కేటాయిస్తే.. నారాయణపేటలో BC సామాజికవర్గానికి చెందిన ఎర్రశేఖర్‌కు టిక్కెట్ అవకాశం ఉంది. నారాయణపేట నుంచి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే మక్తల్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది.
ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరికి బీసీ కోటాలో టిక్కెట్ కోరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలుంటే, కాంగ్రెస్ ప్రకటించిన 8 స్థానాల్లో 4 అగ్రవర్ణాలకు కేటాయించగా, రెండు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజక వర్గాలు. రెండింటిని బీసీ అభ్యర్ధులకు కేటాయించారు. మిగిలిన 6 స్థానాల్లోనూ 2 బీసీలకు కేటాయించాలనే డిమాండ్లు ఉన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 14స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా అందులో 3 బీసీలకు కేటాయించింది.