జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారుల నుంచి లంచం తీసుకుంటున్న మహబూబ్ నగర్ కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వేతనదారుల నుంచి ఆరు వేల రూపాయలు లంచం తీసుకుంటూ రామకోటేశ్వరరావు అనిశాకు చిక్కాడు.
కూలీల పిల్లల వివాహాలు, ప్రసవాలకు ఇచ్చే ఆర్థిక సాయం బిల్లుల కోసం రామకోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశాడు. భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన అంజమ్మ తన కూతురు ప్రసవ కానుక కోసం, నవాబుపేట మండలం కిషన్‌గూడాకు చెందిన నరసింహులు తన కూతురు వివాహా కానుకను సంబంధించి దరఖాస్తులు చేసుకోగా... ఒక్కొక్కరి నుంచి 3 వేలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు కూలీలు... అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అనిశా అధికారులు... కార్మిక శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు.
ప్రతి దరఖాస్తుకు ఓ రేటు
ప్రతి దరఖాస్తుకు ఓ నిర్ణీత ధరను నిర్ణయించి మరీ లంచం వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అనిశా అధికారులు వివరించారు. హైదరాబాద్లోని రామకోటేశ్వరరావు నివాసంలో కూడా సోదాలు చేపట్టామని.. మరింత విచారణ చేసిన అనంతరం అనిశా కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,213 కరోనా పాజిటివ్ కేసులు