మోదీ నాయకత్వంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan reddy) తెలిపారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరుకు చేరుకున్నారు. గ్రామాల్లో అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు. బీసీ కమిషన్‌కు ప్రధాని చట్టబద్ధత కల్పించారని స్పష్టం చేశారు. రైతులకకు ప్రతి ఏడాది కేంద్రం రూ.6వేలు ఇస్తోందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ, కుటుంబం కోసం దేనికైనా తెగిస్తారని కిషన్ రెడ్డి(Union Minister Kishan reddy) మండిపడ్డారు. కేసీఆర్ ఎలక్షన్స్.. కలెక్షన్స్ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టుల పేరుతో రాష్ట్రంలో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.
"కరోనా రెండో దశ విపత్కర పరిస్థితుల్లో యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను హైదరాబాద్‌కు రప్పించాం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే.. కేసీఆర్ ఇవ్వడం లేదని అబద్ధం చెబుతున్నారు. తెలంగాణలోని ప్రతి ఒక వ్యక్తి మీద కేసీఆర్ అప్పులు తెచ్చి పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ, కుటుంబం కోసం దేనికైనా తెగిస్తారు."
- కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
56 కోట్ల మందికి ఇప్పటికే వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan reddy) వెల్లడించారు. 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తున్న మోదీ సర్కార్‌ను ఆశీర్వదించాలని కోరారు.