పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన స్థలంలోనే ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు.
దంతాలపల్లి బొడ్లడా స్టేజీ వద్ద 352/95/1, 352/28 సర్వే నంబర్లలోని 4 ఎకరాల 15 గుంటల భూమిని 2007లో 70 మంది నిరుపేదలు కొనుగోలు చేశారు. 47 మంది ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం భారీ పోలీస్ బందోబస్తుతో అధికారులు ఆ ఇళ్లను కూల్చివేశారు. ఈ ఘటనతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణమని బాధితులు ఆరోపించారు.
ప్రభుత్వ భవనాలను నిర్మించాలంటే 400 ఎకరాలు ఖాళీగా ఉన్న అసైన్డ్ భూమి ఉందని, ఖాళీ భూములను వదిలిపెట్టి, నిరుపేదల ఇళ్లను కూలగొట్టి ప్రభుత్వ భవనాలను నిర్మించడమేంటని జిల్లా కార్మిక సంఘం నాయకుడు ఆళ్వాల వీరయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్లను కూలగొట్టిన స్థలంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: దేశానికి నాయకత్వం వహించే సత్తా కేసీఆర్కు ఉంది: జగదీశ్ రెడ్డి