Animal Lovers: మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లికి చెందిన శ్రీనివాసరావు డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. కుమారుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తె దీపిక వీరితోనే ఉంటున్నారు. దీపిక బీటెక్ చదివే క్రమంలో ఓ రోజు వీధి శునకానికి గాయాలై రోడ్డు పక్కన పడి ఉండటం గమనించారు. చలించిపోయి ఇంటికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేశారు. కుటుంబం చూపిన ప్రేమ, ఆప్యాయతకు ఆ శునకం వారితోనే ఉండిపోయింది. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా కలిసిపోయింది. ఒక శునకంతో మొదలై.. ఆ సంఖ్య దాదాపు 100కు చేరింది. చుట్టుపక్కల గ్రామస్థులు.. బంధువులు కొన్నింటిని తీసుకుపోగా... ప్రస్తుతం 13 కుక్కలను పెంచుతున్నారు.
కుక్కలపై నెలకు 40 నుంచి 50 వేల ఖర్చు..
శునకాలకు రోజూ ఉదయం, సాయంత్రం పాలు, రెండు పూటలా భోజనం, వారానికి రెండుసార్లు మాసం, కోడిగుడ్లు అందిస్తూ ప్రేమగా చూసుకుంటున్నారు. వాటిని చూసుకునేందుకు 2 సంవత్సరాల క్రితం కేర్ టేకర్‌ను నియమించుకున్నారు. కుక్కలపై నెలకు 40 నుంచి 50 వేల వరకు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. కొందరు తిట్టినా... పట్టించుకోకుండా వీధి కుక్కలను పెంచుతున్నామన్నారు.
"అనుకోకుండా ఈ కుక్కలకు మేం ఎడిక్ట్ అయిపోయాం. పిల్లల మాదిరిగానే చూసుకుంటున్నాం. శునకాల వల్ల మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది."
- శ్రీనివాసరావు, విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్
"ఫస్ట్ కుక్కలంటే భయముండేది. మొదట ఓ కుక్క గాయాలతో ఇంటికి వచ్చింది. దాన్ని కాపాడాం. దాంతో ఇంట్లోనే ఉండిపోయింది. అలాగే వీధిలో ఏ కుక్క గాయాలతో కనబడినా ఇంటికి తీసుకొచ్చి.. చికిత్స చేసేవాళ్లం."
- దీపిక, శ్రీనివాసరావు కుమార్తె
మనుషుల కన్నా కుక్కలే విశ్వాసంగా ఉంటాయి..
చుట్టుపక్కల గ్రామాల వాళ్లు శునకాలను పెంచలేక వదిలి వెళ్తుంటారని.. మనుషుల కన్నా కుక్కలే విశ్వాసంగా ఉంటాయని అందుకే వాటిని ప్రేమగా సాకుతున్నామని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శునకాలంటే తమకు అమితమైన ప్రేమని.. మరిన్ని కుక్కలను కూడా పెంచుతామని తెలిపారు.
ఇదీచూడండి: