మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత 2017లో అప్పటి కలెక్టర్ ప్రీతిమీనా ఓ ఏజెన్సీ ద్వారా.. రెవెన్యూ కార్యాలయాల్లో 21 మందిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించారు. వీరికి ఆరు నెలల పాటు సక్రమంగా జీతాలు చెల్లించారు. ఆ తర్వాత వేతనాలు చెల్లించాలని ఒత్తిడి చేయడం వల్ల వీరిని 2019 డిసెంబర్లో తొలగించారు.
పెండింగ్లో ఉన్న తమ వేతనాలు చెల్లించి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని వాపోయారు. కలెక్టరేట్ సమీపంలోని నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ నరేశ్ కుమార్, జిల్లా ఉపాధి శాఖ అధికారి రామకృష్ణ సంఘటనాస్థలికి చేరుకుని, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా నిరసనకారులు ట్యాంక్పై నుంచి దిగారు.