ఆపన్నహస్తం అందించడంలోనూ ముందుంటామని నిరూపించారు నర్సింహులపేట పోలీసులు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్రాం తండా శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి వెంట ఓ అనాథ మహిళ ఒంటరిగా నివసిస్తోంది.
మహారాష్ట్రలోని పూణేకు చెందిన బాకీ అనే మహిళ (38) భిక్షాటన చేస్తూ జాతీయ రహదారి వెంట ముళ్ల కర్రలతో గుడిసె ఏర్పాటు చేసుకుని జీవిస్తుంది. ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్తూ.. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉంటోంది. పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాలువలోని నీటిని తాగుతూ దుర్భర జీవితాన్ని గడుపుతోంది.
ఈమె దీనావస్థను చూసిన ఎస్సై నరేష్ ఆమెకు ఆశ్రయం కల్పించి ఆదుకోవాలని ముందుకొచ్చారు. వెంటనే ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించారు. వారు ప్రత్యేక వ్యాన్‌లో ఆమె వద్దకు చేరుకుని ఫౌండేషన్‌కు తరలించారు. ఒంటరిగా బతుకుతున్న మహిళకు ఫౌండేషన్‌లో అన్ని రకాల వైద్య సేవలు అందించి అండగా నిలువనున్నట్లు తెలిపారు. అనాథకు చేయూతనందించిన ఎస్సైని పలువురు అభినందించారు.
ఇదీ చదవండి:'టీఎంసీ గెలిస్తే బంగాల్.. కశ్మీర్‌లా తయారవుతుంది'