మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర తగ్గిందంటూ మార్కెట్ ముందు మిర్చి రైతులు రాస్తారోకో చేపట్టారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. మహబూబాబాద్-ఇల్లందు ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, మార్కెట్ ఛైర్మన్ రైతులతో చర్చించి ధర కల్పిస్తామని హామీనివ్వడం వల్ల రైతులు రాస్తారోకో విరమించారు.
మార్కెట్‌కు మిర్చిని తీసుకొని వచ్చి 6 రోజులు అయిందని... ఇప్పటి వరకు వేలం పాట, కాంటాలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం క్వింటా మిర్చి రూ.15,600 వరకు పలకగా... ఇవాళ రూ.13,500 కు పడిపోయిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే క్వింటాలు మిర్చికి రూ.16వేల గిట్టుబాటు ధరను కల్పించాలని... మార్కెట్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ మార్కెట్ చాలా చిన్నదని, సామర్థ్యం 4వేల బస్తాలు మాత్రమేనని మార్కెట్ ఛైర్మన్ ఉమ తెలిపారు. వరుసగా సెలవులు రావడం వల్ల మార్కెట్‌కు మిర్చి పోటెత్తిందని అందుకే కొనుగోళ్లకు ఆలస్యం అవుతోందన్నారు. మార్కెట్‌ను మరొక ప్రాంతానికి త్వరగా మార్చాలని ప్రభుత్వానికి నివేధించామని తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..?