తల్లిదండ్రులు తనకు ఇష్టంలేకుండా పెళ్లి చేస్తున్నారని ఇంటర్ విద్యార్థిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్ బాలికను సన్మానించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం, మన్నెగూడెంకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదివింది. ఈ వేసవిలో ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. తనకీ పెళ్లి ఇష్టంలేదు.. చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోకపోవడం వల్ల మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసింది.
స్పందించిన అధికారులు గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన బాలికను పలువురు అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్ విద్యార్థినిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ బిందు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Vaccine : వ్యాక్సిన్‌తోనే రక్ష.. నిరూపించిన నిజామాబాద్ జీజీహెచ్