మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో పెళ్లి పీటలపైనే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి సాయం అందింది. బుధవారం డివిజన్ కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో మాటేడు గ్రామానికి చెందిన మహంకాళి గౌతమి, మంగళపల్లి గోవర్దన్ వివాహం జరిగింది. కాగా ఈ వివాహ వేదికపైనే పెళ్లి కూతురు తల్లి ఉపేంద్రకు జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌తో కలిసి తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి రూ.1,00,116 కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు.
పేదింటి ఆడపిల్లల పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం సాయం అందించి ఆదుకుంటుందని తెలిపారు. 2014 అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మొదట్లో రూ. 51,000 అందించేవారని, తర్వాత రూ.75,116లకు పెంచారని, 2018 నుంచి రూ.1,00116 ఇస్తున్నారని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకానికి పెళ్లికి ముందే దరఖాస్తు చేసుకుని సాయం పొందవచ్చని తెలిపారు.
లగ్నపత్రిక రాయించుకున్న రోజునే వధువు కుటుంబ సభ్యులు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కులం, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలు మీ సేవలో సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల సరిగ్గా పెళ్లి ముహూర్తాని కల్లా రూ.1,00116 సాయం పొందవచ్చన్నారు.
ఇదీ చదవండి: ఆధునిక హంగులతో 'కేసీఆర్ నగర్'.. ప్రారంభించనున్న సీఎం