రాష్ట్రంలో గత పది.. 15 రోజుల పాటు కురిసిన వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో దెబ్బతిన్న పెసర, మొక్కజొన్న, పసుపు పంటలను ఆయన పరిశీలించారు. జిల్లాలో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ అధికారిని, పంటలపై పెట్టిన పెట్టుబడులు, రైతుల ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు.
కొన్ని జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరి పంటలు మొత్తం పూర్తిగా కొట్టుకుపోయాయని, ఈ ప్రాంతంలో పెసర పంట పూర్తిగా, పత్తి, మొక్కజొన్న పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఏ పంటకు ఎంత నష్టం జరిగిందో అంచనా వేయలేనటువంటి దుస్థితి రాష్ట్రంలో నెలకొందని, రైతుబంధును చూపెడుతూ మిగతావన్నీ పక్కన పెడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంటల బీమా పథకం , ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతులకు కూడా బీమాను చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షంతో నష్టపోయిన పంటలను సర్వే చేసి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయామని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు. వరి, పెసర పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేలు, పత్తి పంటకు జరిగిన నష్టాన్ని బట్టి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలను ఎత్తివేశారని, భూ ప్రక్షాళన ద్వారా రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులకు పాసుపుస్తకాలు అందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కేంద్రం పూర్తి పరిహారం ఇవ్వాల్సిందే : మంత్రి హరీశ్