రక్తదానం ప్రోత్సహించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ యువతను కోరారు. మహబూబాబాద్ పట్టణంలోని ఐఎంఏ హాలులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదానాన్ని ప్రోత్సహించాలని, రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవాలని, ఇదొక మంచి కార్యక్రమమని కలెక్టర్ పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్థులు, గర్భిణీలు, ప్రమాద బాధితులకు రక్తం అవసరమని, వారి కొరకు ఒక యాప్ ఏర్పాటు చేశామని, రక్త దాతలు తమ పేర్లను బ్లడ్ గ్రూప్‌తో సహా యాప్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 306 మంది తన అభిమానులు, తెరాస కార్యకర్తలతో రక్తదానం చేయిస్తున్నామని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాంమోహన్ రెడ్డి, కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, తహసీల్దార్ రంజిత్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.