కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లులను శాస్త్రవేత్తలు, మేధావులు ఆహ్వానిస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ బిల్లులను ఆమోదించిందని, దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. దీని వల్ల రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కంటే మెరుగైన ధర లభించడం వల్ల ఆదాయం పెరుగుతుందని అన్నారు.
అలాగే ఒప్పంద వ్యవసాయం వల్ల రైతు పంట పండించే ముందే ధర నిర్ణయమవుతుందని ఆయన అన్నారు. మార్కెట్ యార్డులు ఉండవని, మద్దతు ధర ఉండదని ప్రతిపక్షాలు ఉనికి కోసం విషప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఖమ్మం మిర్చి యార్డులో మిర్చి ధరను ప్రశ్నించిన రైతులకు సంకెళ్లు వేసిన ఘనత తెరాసకు దక్కిందని, అలాంటి వారికి రైతు బిల్లులను విమర్శించే అర్హత లేదన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ కమర్షియల్ చేశారు: ఉత్తమ్