Teacher misbehave with Student : భావితరాలకు బడిలో జ్ఞానాన్ని నింపాల్సింది పోయి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు యత్నించాడంటూ మహబూబాబాద్ జిల్లాలో ఓ టీచర్‌ను గ్రామస్థులు చితకబాదారు. పరీక్షలను అడ్డుపెట్టుకుని మార్కులను అవకాశంగా చూపి బిడ్డల్లాంటి విద్యార్థినులను వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.
పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు మహేందర్ పదోతరగతి విద్యార్థినుల పట్ల గత కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ విద్యార్థిని తమ తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు మహేందర్‌ను చితకబాదారు. అనంతరం అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
"నా బిడ్డ పదోతరగతి చదువుతుంది. గత రెండు నెలలగా నా బిడ్డను వేధిస్తున్నాడు. ఎవరికన్న ఈ విషయం చెబితే నీపని చేస్తా అని బ్లాక్‌మొయిల్ చేస్తున్నాడు. చేతుల మీద కొట్టడంతో పాటు లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అతడిని కఠినంగా శిక్షించాలి."
- విద్యార్థిని తల్లి
"పిల్లలను చదువుకోవాలని పాఠశాలకు పంపిస్తున్నాం. కానీ సార్ ఇంత మోసం చేస్తాడనుకోలేదు. పిల్లలని ఆగం చేశాడు. ఈ విషయాన్ని మాకు మా అమ్మాయి చెప్పింది. అతడిని వెంటనే సస్పెండ్ చేయాలి."
- విద్యార్థిని బంధువు
ఇదీ చదవండి: ఇష్టం లేని పెళ్లి.. నెలరోజులకే నవవధువు ఆత్మహత్య
పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని పట్టుకున్న మహిళ.. ఇద్దరూ సజీవదహనం