Special Busses For Medaram : తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర సమయం దగ్గరపడుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున జాతరకు తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి 115 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తెలిపారు. మరో 25 బస్సులు సిద్ధంగా ఉంచామని.. రద్దీని బట్టి వాటిని నడిపిస్తామని వెల్లడించారు. ఈ సర్వీసులు ఈ నెల 13 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
భక్తులకు ఆర్టీసీ కార్గో గుడ్న్యూస్..
జాతరకు వెళ్లలేనివారు మొక్కులు చెల్లించేందుకు ఆర్టీసీ కార్గో ద్వారా ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. రూ. 400 చెల్లించి బంగారాన్ని (బెల్లం) బస్టాండులోని కార్గో సర్వీసులో అందజేస్తే మేడారంలో అమ్మవారికి సమర్పించి... తిరిగి భక్తులకు పసుపు, కుంకుమ, ప్రసాదం అందజేస్తామని తెలిపారు. అందుకోసం ఆర్టీసీ ఆవరణలో రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇవి 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి.
టిక్కెట్టు ఛార్జీలు ఇలా..
మహబూబాబాద్ నుంచి మేడారం వెళ్లేందుకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 ఛార్జి ఉంటుంది. గూడూరు నుంచి పెద్దలకు రూ.230, పిల్లలకు రూ.130 టిక్కెట్టు ధర చెల్లించాలి. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారు గద్దెల సమీపంలోకి చేరుకోవచ్చని... భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించిన వారినే బస్సులోకి అనుమతిస్తామని.. ప్రతి ట్రిప్పునకు బస్సును శానిటైజ్ చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి : Medaram Prasadam: ఈసారి ఇంటి వద్దకే మేడారం ప్రసాదం... డోర్ డెలివరీకి ఏర్పాట్లు