కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల పేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. రహదారి లేకపోవడం ఓ మాతృమూర్తికి తీరని దుఃఖం మిగిల్చింది. జిల్లెడకు చెందిన కనక కల్పన అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. బంధువులు వెంటనే 108కి ఫోన్ చేశారు. జిల్లెడకు రావడానికి రహదారి సరిగా లేదని.. అంబులెన్స్ రాలేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. చేసేదిలేక కుటుంబ సభ్యులు ఒక ట్రాక్టర్ను తీసుకుని గర్భిణీని అందులో ఎక్కించుకుని బెజ్జురు ప్రాథమిక ఆసుపత్రికి బయలుదేరారు. పురిటి నొప్పులు అధికమవడం వల్ల మార్గమధ్యలోనే ప్రసవించింది కల్పన. ప్రసవించిన మహిళను, శిశువును తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందిందని తెలిపారు.
ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి