Telangana weather report: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమురంభీం జిల్లాలోని సిర్పూర్‌లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల్లో 8 నుంచి 10 డిగ్రీలే ఉంటుందని అంచనా.
ఈ శీతాకాలంలో ఇంతవరకూ చలి తీవ్రత పెద్దగా లేదు. ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుంది. రాత్రిపూట భూవాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 25 శాతం వరకు అదనంగా పెరిగింది.
కమ్మేస్తున్న పొగమంచు..
Winter Effetc in Telangana : రాష్ట్రంలో ఓ వైపు చలి వణికిస్తుంటే... మరోవైపు ఉదయం పూట పొగమంచు పరిసరాలను కమ్మేస్తుంది. ప్రధానంగా పచ్చదనం, చెట్లు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. బాహ్య వలయ రహదారిపై విపరీత మంచుతో ముందు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంటోంది. ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రమాదాలకు ఆస్కారం...
Fog in The Morning : ఓఆర్‌ఆర్‌పై వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన భారీ సరుకుల వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, కార్లు వంటి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సర్వీస్ రోడ్డులో స్థానికంగా వివిధ పనులపై వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్తుంటాయి. ఐటీ క్షేత్రాల్లో కూడా అంతగా ట్రాఫిక్ లేకపోయినా కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సుల వంటి వాహనాలు రాకపోకలు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల వాహనాల వేగం అధికంగా ఉంటోంది. కొందరు ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్లపై ప్రమాదకరంగా వాహనాలు నిలుపుతున్నారు. పొగమంచు కమ్ముకున్న సమయంలో అప్రమత్తంగా లేని పక్షంలో వాహనాలు కనిపించక ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని ట్రాఫిక్ పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత కొనసాగే వరకూ మంచుప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు.
పొగమంచు కురుస్తున్న సమయంలో తప్పనిసరి ప్రయాణమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- తెల్లవారు నుంచి ఉదయం వెలుతురు స్పష్టంగా వచ్చే వరకు అప్రమత్తత అవసరం.
- పొగమంచు పరిస్థితుల్లో ఉదయం వెళ్లకపోవడమే శ్రేయస్కరం. వెలుతురు స్పష్టంగా ఉన్నపుడే ప్రయాణం మొదలుపెట్టాలి.
- పొగమంచులో సూక్ష్మ నీటి బిందువులు ఉంటాయి. మసకగా ఉన్న సమయంలో హైబీమ్ హెడ్ లైట్స్ (దూరంగా ప్రసరించే) వేయకూడదు. ఆ లైట్లు వేస్తే నీటి బిందువులు ప్రతిబింబించి వెలుతురు నిరుపయోగమవుతుంది. లో బీమ్ హెడ్ లైట్లు(దగ్గరగా ప్రసరించే) డ్రైవర్లకు ఉపయుక్తం.
- అద్దాలపై తేమ వల్ల ముందున్న వాహనాలు కనిపించని పరిస్థ్థితులు నెలకొంటే తేమను తొలగించేందుకు వైపర్‌లు, డీ ఫ్రోస్టర్‌లు వేగంగా వినియోగించాలి.
- పరిమిత వేగంతో వాహనాలు నడిపించాలి. వాహనాల మధ్య నిర్ణీత దూరం ఇదివరకు మాదిరిగా కాకుండా ఎక్కువగా తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో బ్రేకులు వేసేందుకు వీలవుతుంది.
- బ్రేకు వేయడానికి ముందు.. రేర్ వ్యూ మిర్రర్ ద్వారా వెనుక వచ్చే వాహనాలను నిశితంగా పరిశీలించాలి.
- అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను నిలపాల్సి వస్తే ప్రధాన రహదారి (క్యారేజ్‌వే)పై పార్క్ చేయకుండా ఇతర వాహనాలు, పాదచారులకు అవాంతరాలు కలగని సురక్షిత ప్రదేశాల్లోనే నిలపాలి. హజార్డ్ లైట్లు ఆన్‌లో ఉంచాలి.
- రహదారులపై లేన్ మారుస్తున్నపుడు, మలుపు తీసుకుంటున్నపుడు కిటికీ అద్దాలు కొంతమేర కిందికి దించి ఇతర వాహనాల శబ్దాలు గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగాలి.
- క్రమం తప్పకుండా హారన్ మోగిస్తూ ముందు వెళ్తున్న వాహనాలను అప్రమత్తం చేయాలి.
ఇదీ చదవండి: కరోనా కాలంలో ఎంతమంది పిల్లలు అనాథలయ్యారంటే?