స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఎస్పీఎం పరిశ్రమ యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మికులు ఆరోపించారు. ఈ అంశం పై కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం బీఎంఎస్ కార్యాలయంలో చర్చావేదిక ఏర్పాటు చేశారు. పలు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి కార్మికులు వారి మద్దతు కోరారు. 2014లో మూతపడిన పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం 2018లో పునఃప్రారంభించిదని కార్మికులు అన్నారు. పునఃప్రారంభం సందర్బంగా మిల్లులో పనిచేసిన ప్రతి కార్మికుడిని దశల వారిగా విధుల్లోకి తీసుకుంటామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా స్థానికులను కాదని ఇతర రాష్ట్రాల వారిని విధుల్లోకి తీసుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు.
కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేకూరేలా రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. ప్రభుత్వ రాయితీలు పొందుతూ స్థానికులను విధుల్లోకి తీసుకోకపోవడం నిరంకుశ వైఖరికి అద్దం పడుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు ఎన్సీఎల్టీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో కార్మికుల ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి కార్మిక సమస్యల పట్ల ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు సూర్య ప్రకాశ్, సీఐటీయూ నాయకులు ఓదేలు, భాజపా నాయకులు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్వాయి హరీశ్ బాబు, తెదేపా నాయకులు ఆనంద్, సీపీఎం నాయకులు ముంజం ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బ్యాంకు ఉద్యోగిపై.. దానం నాగేందర్ దౌర్జన్యం!