కుమురం భీం జిల్లా కౌటాలకు చెందిన విష్ణుమూర్తి.. సంకల్పం ముందు వైకల్యం బలాదూర్ అని నిరూపిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం వ్యవసాయ పనులు చేస్తూ కాళ్లు కోల్పోయినా.. కృత్రిమ కాళ్లతో ట్రాక్టర్ నడుపుతూ భళా అనిపిస్తున్నాడు. విధి కన్నెర్ర చేసినా లెక్కచేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ.. ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అనుకోని ప్రమాదమే ఆ జీవితాన్నే మార్చేసింది
కౌటాల మండలం గురుడుపేటకి చెందిన విష్ణుమూర్తి డిగ్రీ పూర్తి చేశాడు. నాలుగేళ్ల క్రితం తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు పొలానికి వెళ్లాడు. ధాన్యం కుప్పలను క్రషర్‌లో వేసే క్రమంలో ప్రమాదవశాత్తు అతని కాళ్లు వాటి చక్రాల్లో పడి.. మోకాళ్ల వరకు ఛిద్రమైపోయాయి.
కాళ్లు కోల్పోయినా అధైర్యపడలేదు
కాళ్లు కోల్పోయినా.. విష్ణుమూర్తి ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. కొడుకును కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు. యువకుడి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించి జర్మన్ టెక్నాలజీతో తయారైన కృత్రిమ కాళ్లను అమర్చేలా కృషిచేశారు. ఆ మేరకు అతను మళ్లీ పాత జీవితాన్ని గడుపుతున్నాడు.
ఇదీ చదవండి: 'పట్టుదల ముందు... వైకల్యం చిన్నబోయింది'