పారిశ్రామిక రంగంపై కరోనా తీవ్రంగా ప్రభావం పడుతోంది. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లును యాజమాన్యం ఈ నెల 5 నుంచి 15 వరకు షట్‌డౌన్ ప్రకటించింది. ఇటీవల ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు రావడంతో పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ముందు జాగ్రత్తగా మిల్లుకు షట్‌డౌన్ ప్రకటించారు.
లాక్‌డౌన్ సమయంలోనూ ఎస్పీఎం యాజమాన్యం వేతనాలు చెల్లించింది. ఆంక్షల సడలింపు అనంతరం మే 20 నుంచి కాగితం ఉత్పత్తిని ప్రారంభించింది. హైదరాబాద్, నాగ్‌పూర్, దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్ తదితర కేంద్రాలకు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. నిల్వలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో షట్‌డౌన్ గడువును యాజమాన్యం మరింత పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
శాశ్వత కార్మికులపై యాజమాన్య వైఖరిని నిరసిస్తూ పలువురు కార్మికులు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిసి ఫిర్యాదు చేశారు. మిల్లులో శాశ్వత కార్మికులకు కనీసం 10 వేల వేతనం కూడా చెల్లించడం లేదని.. అసలు వేతనం ఎంత, ఎంత కోత విధిస్తున్నారనే పూర్తి వివరాలతో కూడిన జీతం రశీదులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఒప్పంద కార్మికులకు చెల్లించే వేతనాలు కూడా శాశ్వత కార్మికులకు చెల్లించడం లేదని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యాజమాన్యంతో చర్చించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం