POCSO COURT INAUGURATED: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోక్సో కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. చిన్న పిల్లలపై రోజురోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలను నివారించడానికి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 100 కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో పోక్సో కోర్టు ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో 220, ఆసిఫాబాద్లో 135, నిర్మల్లో 112, ఆదిలాబాద్లో 165 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దానిని ఆధారంగా చేసుకొని గతంలోనే వర్చువల్ విధానంలో ఆదిలాబాద్ పోక్సో కోర్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో కోర్టులు ఈరోజే ప్రారంభించామని జస్టిస్ కె.లక్ష్మణ్ వెల్లడించారు.
"ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పిల్లలు విద్యాభ్యాసం కొనసాగించడానికి ఆన్లైన్ తరగతులు వింటున్నారు. దీనివల్ల సాంకేతికత పెరిగి చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరగడానికి కారణమయ్యాయి. చిన్నారులు ఆన్లైన్ తరగతులు వినేటప్పుడు తల్లిదండ్రులు వారిని గమనిస్తూ ఉండాలి. గతంలో రాష్ట్రంలో పది జిల్లాలు మాత్రమే ఉండేవని ప్రస్తుతం వాటిలో జిల్లా కోర్టులు ఉన్నాయి. ముప్పై మూడు జిల్లాల ఆవిర్భావం తర్వాత జిల్లా కోర్టులు ఏర్పాటు చేయడానికి హైకోర్టు ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం రానున్న రోజుల్లో కొత్త జిల్లాలో జిల్లా కోర్టులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది." -జస్టిస్ కె.లక్ష్మణ్, హైకోర్టు న్యాయమూర్తి
కోర్టులు అన్ని ఒకే ప్రాంగణంలో
కోర్టులు అన్ని ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి నమూనా రూపకల్పన చేసినట్లు జస్టిస్ కె.లక్ష్మణ్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో హైకోర్టు వెబ్సైట్లో ఈ నమూనా అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త జిల్లాలో స్థలం అందుబాటులో ఉన్న చోట కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన న్యాయం అందే విధంగా చూడాలన్నారు. గుస్సాడీ నృత్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును సన్మానించడం సంతోషంగా ఉందని జస్టిస్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జడ్జి ఎంఆర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Koti goti Talambralu: భద్రాద్రి రాములోరి కల్యాణానికి గోటితో కోటి తలంబ్రాలు