కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నార్లపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పైకాజిగూడ గ్రామం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామంలో 60 ఏళ్లుగా ఒకే కులానికి చెందిన సుమారు 60 కుటుంబాలు జీవిస్తున్నాయి. చుట్టూ వాగు... మధ్యలో గ్రామం... ఉండటం వల్ల గ్రామస్థులకు ఏ చిన్న అవసరం పడినా వాగు దాటాల్సిందే. ఒడ్డుకు తాడు కట్టి... ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తాడు సాయంతో సాహస యాత్ర చేపట్టాల్సిన పరిస్థితి.
వర్షాకాలంలో సరేసరి...
వర్షాకాలంలో వాగు ఉద్ధృతి పెరగటం వల్ల తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు వివరించారు. వాగు దాటే క్రమంలో కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయన్నారు. . అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలంటే మార్గమధ్యలోనే ప్రాణాలు పోయే దుస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది పురిటి నొప్పులతో బాధపడుతున్న బాలింతను ఎడ్లబండిపై ఆసుపత్రికి తీసుకెళ్తుంటే మార్గమధ్యలోనే ప్రసవించిందని తెలిపారు.
పిల్లలకు పెళ్లి కావటంలేదు...
గ్రామంలో మంచి నీటి సౌకర్యం, డ్రైనేజీలు లేక రోడ్లన్నీ బురదమయంగా మారాయని... ఫలితంగా దోమలు ఎక్కువై రోగాలు ప్రబలుతున్నాయన్నారు. కనీసం బడి సౌకర్యం కూడా లేకపోవటం వల్ల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం కూడా లేకపోవటం వల్ల పెళ్లిళ్లు చేసుకుందామంటే ఎవరూ పిల్లను కూడా ఇవ్వడంలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసొచ్చిన ఆడపిల్లలకు పెళ్లిల్లు చేద్దామంటే తమ ఊరు పేరు చెబితేనే ఎవ్వరూ ముందుకు రావటం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఎన్నికలప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు వంతెన కట్టిస్తామని హామీ ఇచ్చి... గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా కన్పించలేదని ఆరోపించారు. కలెక్టర్కు కలిసి ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా... తమ గ్రామ సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని తమ గ్రామానికి రోడ్డు, వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.