No Bridge No Election flexis in Asifabad : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్నటువంటి గుండి గ్రామానికి 2006లో వంతెన నిర్మాణం అప్పటి ప్రభుత్వం చేపట్టగా.. ఇప్పటికి 17 ఏళ్లు గడిచి రెండు ప్రభుత్వాలు మారాయి. కానీ, వంతెన నిర్మాణం పూర్తి కాలేదని గుండి గ్రామ ప్రజలు, యువత ఆవేదన చెందుతున్నారు. దీనిలో భాగంగా 2023లో జరుగుతున్న శాసనసభ ఎన్నికలను బహిష్కరించడానికి గుండి గ్రామ ప్రజలు, యువత ఏకతాటిపైకి వచ్చారు. 17 ఏళ్ల నుంచి గుండి వాగు పైన కడుతున్న వంతెన ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో.. వైద్య, విద్య పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. వర్షాకాలం వచ్చిందంటే నాలుగు నెలలు విద్యకు, వైద్యానికి దూరమై.. ప్రాణాలు పోయిన ఘటనలు, శిశు మరణాలు ఎన్నో జరిగాయని ఆవేదన చెందుతున్నారు.
Gundi Bridge Construction Issue : బ్రిడ్జి నిర్మాణం విషయంలో 2016లో అప్పుడున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు గుండి గ్రామ ప్రజలు పాదయాత్ర చేస్తూ వంతెన నిర్మాణం చేయాలని వినతిపత్రం సమర్పించారు. అయినప్పటికీ పూర్తి కాలేదని తెలిపారు. 2006 నుంచి 2023 వరకు నాయకులు వంతెన నిర్మాణం చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ పూర్తి కాలేదని తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గుండి గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఇప్పటివరకు వంతెన పూర్తి కాకపోవడంతో నో బ్రిడ్జ్, నో ఎలక్షన్ అంటూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామం లోపల కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Asifabad Bridge Issue : వంతెన లేక నిత్యం వెతలే.. వాగు దాటాలంటే చాలు గుండెల్లో గుబులే!
Gundi Village People Suffers to Travel Through Canal : గుండి వంతెన నిర్మాణం పూర్తి అయితే గుండి గ్రామం చుట్టూ ఉన్నటువంటి సుమారుగా 15 గ్రామాలకు రాకపోకలకు సులభతరం అవుతుందని తెలిపారు. గుండి వంతెన నిర్మాణం గురించి జిల్లా సర్వసభ్య సమావేశంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. వంతెన నిర్మాణం కొనసాగటం లేదని తెలిపారు. నాయకులకు, జిల్లా అధికారులకు మొర పెట్టుకున్నా ఆలకించటం లేదని అన్నారు. ఇప్పటికైనా వంతెన నిర్మాణం పూర్తి చేస్తేనే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని కరాకండిగా తెలిపారు.
Government Negligence On Gundi Bridge Construction : వంతెన నిర్మాణం పూర్తి చేయనట్లయితే ఎన్నికలను బహిష్కరిస్తామని గుండి యువత, ప్రజలు పేర్కొన్నారు. వర్షాకాలంలో వాగు నిండుగా పారుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ధర్మకోల్తో తయారు చేసినటువంటి నాటు పడవలతో వాగులో అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని దాటుతూ ఉంటామని తెలిపారు. వంతెన నిర్మాణం కోసం నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచేంత వరకు చేస్తామని హామీలు ఇచ్చి.. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు మరిచిపోయారని వాపోతున్నారు.