ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వలస కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. ఒక్కరు ఉపవాసం ఉండడానికి వీల్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సర్వే చేసి 2,478 మంది వలస కూలీలను గుర్తించింది. వీరికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కో కుటుంబానికి 12 కిలోల బియ్యం, కుటుంబంలో ఒక్కో వ్యక్తికి రూ.500 చొప్పున నగదును పంపిణీ చేసింది.
ఇందుకు 30 టన్నుల బియ్యంతో పాటు, రూ.14 లక్షలను కేటాయించారు. అయితే ఈ సర్వేలో పెద్ద పరిశ్రమలు, జిన్నింగు మిల్లులు, రైస్‌మిల్లులు, వీటినే అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ మండలంలో నాలుగు వలస కార్మికుల పునరావాస కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌లోని మూడు, వంజరిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 133 మంది వలస కార్మికులు ఉన్నారు. వీరికి నిత్యం భోజనం పెడుతున్నారు.
ఇంకా సాయం అందాల్సిన వారు.. 1,040 మంది...
అధికారులు ఇటీవలే రెండో విడత సర్వేను పూర్తి చేశారు. జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు, సిమెంటు ఇటుకలు, రింగులు చేసుకునే వారు, నిత్యం కూలీ పనులు చేసుకునే వారు, చిన్నపాటి వృత్తులు చేసుకునే వారిలో అర్హులను 1,040 మందిని గుర్తించారు. వీరికి సైతం 12 కిలోల బియ్యం, రూ.500 నగదును అందించనున్నారు. సహాయం కోసం కూలీలు ఆయా తహసీల్దార్ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు.
నివేదికలను పంపించాం..
రెండో విడత సర్వేలో 1,040 వలస కూలీలను గుర్తించాం. నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. ప్రభుత్వం నుంచి బియ్యం, నగదు విడుదల కాగానే అర్హులైన వలస కూలీలకు అందిస్తాం.
- రాంబాబు, జిల్లా అదనపు పాలనాధికారి
ఇదీ చూడండి: తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు