Meteor Shower in Ashifabad: కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశంలో కాంతిరేఖలు కనువిందు చేశాయి. శనివారం రాత్రి 8 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశం నుంచి వెలుగులు చిమ్ముతూ నేలవైపు దూసుకు రావడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కొమురం భీం, ఆదిలాబాద్ పట్టణవాసులు, భీంపూర్ మండలవాసులు ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో బంధించారు.
'శివాలయంలో పూజా కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్లాం. అక్కడ ఆకాశంలో వింతంగా తొక చుక్కలాగా ఏడు ఎనిమిది వరుసగా వెళ్లడం చూశాం. వాటిని చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాం.' అని వాటిని చూసిన ఆసిఫాబాద్ స్థానికులు తెలిపారు.
ఇవి ఏమిటనే విషయంలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటి విషయమై హైదరాబాద్‌లోని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి రఘునందన్‌ను ‘ఈనాడు-ఈటీవీ భారత్’ సంప్రదించింది. ‘ఇది ఉల్కాపాతం అనే ప్రచారం జరిగినా.. నిజం కాదు. గ్రహశకలం కానీ, తోకచుక్కకు సంబంధించిన పదార్థం కానీ భూమి వాతావరణంలో ప్రవేశించి మండడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. లేదా గతంలో ప్రయోగించిన రాకెట్ విడిభాగాలు కావొచ్చు’నని తెలిపారు. అయితే చివరకు 2021లో చైనా ప్రయోగించిన చెంగ్ జాంగ్ 3వీ రాకెట్ తిరిగి భూమిపైకి తిరిగి వస్తూ ఇలా పడిపోయిందని తేలింది.
ఇదీ చదవండి : ఆకాశంలో అద్భుతం.. కిందకు పడినవి ఉల్కలా? ఉపగ్రహ శకలాలా?