కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రౌట సంకెపల్లి గ్రామానికి చెందిన గజ్జెల రాణికి శుక్రవారం ఉదయం రక్తస్రావమైంది. కుటుంబసభ్యులు సెల్‌ఫోన్‌లో ఏఎన్‌ఎంకు సమాచారమివ్వగా.. ఆమె 108 అంబులెన్స్‌కు విషయం తెలియజేశారు. వాహనం గ్రామానికి రాలేని పరిస్థితి. దీంతో గర్భిణిని తీసుకొని ఆమె భర్త ఎడ్లబండిపై సమీపంలోని ఆర్‌ఆర్ కాలనీకి ఉదయం 6:30కు చేరుకున్నారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని కౌటాల మండల కేంద్రం నుంచి 108 అంబులెన్స్ వచ్చేసరికి 7:30 అయింది. అప్పటికే ఆమె మృతశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం రాణిని ఆసిఫాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తన భార్య ఆరు నెలల గర్భంతో ఉందని.. మొదటి కాన్పులోనే నెలలు నిండకముందే ఇలా ప్రసవమై, గర్భశోకం మిగిలిందని భర్త గంగు వాపోయారు.
పోరాటయోధుడు కుమురం భీం గ్రామమిది
ఆదివాసీల హక్కుల కోసం అమరుడైన పోరాటయోధుడు కుమురం భీం జన్మస్థలం రౌట సంకెపల్లి. ఇంతటి విశిష్టత కలిగిన గ్రామానికి ఇప్పటికీ రహదారి లేదు. ఏడాది క్రితం (2019, అక్టోబర్ 31) సైతం ఇదే గ్రామానికి చెందిన మహిళను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. రహదారి పక్కనే ప్రసవమై మృత శిశువుకు జన్మనిచ్చింది.

ఎన్నాళ్లీ ప్రసవ వేదన..?
నేటికీ అనేక గ్రామాల్లో వాగులపై వంతెనలు లేక అత్యవసర సమయాల్లో వైద్యం అందక అవస్థలు పడాల్సి వస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం దేవబండ గ్రామానికి చెందిన విజయలక్ష్మికి శుక్రవారం పురిటినొప్పులు రావడంతో అయిజకు చేరుకొనేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. గ్రామం నుంచి అయిజకు 5 కిలోమీటర్లే అయినా.. మధ్యలో వాగు దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గర్భిణిని కుటుంబసభ్యులు, గ్రామస్థులు చేతులపై మోసుకొని వాగు దాటించారు. ఈ సందర్భంగా ఆమె అవస్థ వర్ణనాతీతం. వాగు అవతలికి వెళ్లిన తర్వాత 108 వాహనంలో అయిజ పీహెచ్‌సీకి తరలించారు. ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఇదీ చదవండిః తరాలు మారిన తీరని సమస్యలు.. అమలుకు నోచుకోని హామీలు