ఆరో విడత హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి కోరారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ సమీపంలోగల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి మొక్కలు నాటారు.
ప్రస్తుతం ఉన్న 25 శాతం అటవీ సంపదను 33 శాతానికి పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోవా లక్ష్మి సూచించారు. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతీ ఒక్కరు 6 మొక్కలను నాటాలని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని భావితరాలకు మంచి పర్యావరణాన్ని ఇవ్వాలని ఆత్రం సక్కు కోరారు. జడ్పీ ఛైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కును విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేశ్వర్లు చారి, ఉపాధ్యక్షులు తుమోజు సురేశ్ చారి తదితరులు పాల్గొన్నారు.