కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన యువతి ఎమ్మాజి రజితకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ శాఖ నిర్వహించనున్న 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెర్జింగ్ లైబ్రరీస్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు హైబ్రిడ్' అనే అంశంపై నిర్వహించే సదస్సులో పాల్గొననున్నారు. రజిత రాసిన రెండు పరిశోధన పత్రాలు ఎంపిక కావడం విశేషం. ఈ నెల 28, 29 తేదీల్లో కర్ణాటక యూనివర్సిటీలోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్‌లో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు.
తమ కూతురికి దక్కిన ఈ అరుదైన గుర్తింపు పట్ల తల్లిదండ్రులు ఎమ్మాజి అభిమన్యు, రమక్కలు ఆనందం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను భారంగా భావిస్తున్న తరుణంలో రజిత గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామస్థులు అంటున్నారు. తమకూ గర్వించదగిన అంశమని కొనియాడారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు సెంట్రల్ యూనివర్శిటీలో డా.తడ్డి మురళి పర్యవేక్షణలో పీహెచ్డీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్