అది నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రణభూమి. మలిదశ తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిమంతంగా నిలిచిన వీరగడ్డ. గిరిజనులకే కాదు... గిరజనేతరులకు దిక్సూచిగా నిలుస్తున్న రణస్థలి. అదే కుమురంభీం జిల్లాలోని జోడేఘాట్ అటవీప్రాంతం. ప్రస్తుతం కనీస వసతులకు నోచుకోకుండా... పాలకుల నిరాదరణకు అద్దం పడుతోంది.
తూతూ మంత్రంగా
జిల్లాల పునర్విభజన తర్వాత ఆసిఫాబాద్‌ను కుమురం భీం జిల్లాగా పేరుమార్చిన ప్రభుత్వం... దానికి అనుగుణంగా నిధులు విడుదల చేసింది. 2015లో 25కోట్ల రూపాయలతో జోడేఘాట్ కేంద్రంగా సర్కారు భీం స్మారక క్షేత్రం ఏర్పాటు చేసింది. ఆ వీరుడి పోరాట పటిమని భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా హత్తి నుంచి జోడేఘాట్ వరకు మూడు మీటర్ల వెడల్పుతో కలిగిన 22 కిలోమీటర్ల రహదారిని.. 7 మీటర్ల వెడల్పుతో తారురోడ్డు కోసం 2016లో 22 కోట్ల నిధులు కేటాయించింది. ఆర్అండ్బీ శాఖ నేతృత్వంలో పనులు దక్కించుకున్న సీ-5 కంపెనీ. 2018లోనే పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ పనులు జరిగేదంతా మారుమూల అటవీప్రాంతం కావడం వల్ల నిబంధనలేవీ పాటించకుండా తూతూ మంత్రంగా నిర్వహించి మధ్యలోనే వదిలేయడం వల్ల ఇప్పటికీ రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.
శిలాఫలకం ఊడిపోయింది
జోడేఘాట్‌లో భీం విగ్రహం వద్ద సీఎ కేసీఆర్ ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన శిలాఫలకం ఊడిపోయింది. ప్రహారి చుట్టూ ఏర్పాటు చేసిన పచ్చగడ్డికి నీరుపట్టక ఎండిపోయింది. విద్యుత్ కాంతులను వెదజల్లాల్సిన సోలార్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి దీపాలు వెలగడం లేదు. మ్యూజియం దగ్గర భీం చరిత్ర తెలిపేలా గైడ్‌లను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచన నాలుగేళ్లుగా ఆచరణలోకి రాలేదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జోడేఘాట్‌ను ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.
ఉట్నూర్ ఐటీడీఏ యంత్రాంగం, పర్యాటకశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి ఆమడ దూరంలో నిలుస్తోంది.
ఇదీ చూడండి : అజరామరం: కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించిన 'తెలంగాణం'