కుమురం భీం జిల్లా వ్యాప్తంగా సుమారు 40 ప్రభుత్వ దవాఖాలున్నాయి. వీటిలో ఏడాది కాలంలో 4430 ప్రసవాలు జరిగితే 18 మంది గర్భిణీలు, 22 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు కొరతతో వైద్య సిబ్బందే ప్రసవం చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు లేకపోవడం వల్లే తమ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆందోళన చేస్తున్నారు.
ఆసక్తి చూపని వైద్యులు
రూ.11కోట్లతో అన్ని వసతులతో నిర్మించిన అసిఫాబాద్ ఆస్పత్రిలో 47 మంది వైద్యులు అవసరం కాగా కేవలం 15 మందినే కేటాయించారు. కాని వీరిలో చాలామంది ఇక్కడ పనిచేయడానికి సుముఖంగాలేరు. సెలవుల పేరుతో విధులకు దూరంగా ఉంటున్నారు. బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం వల్ల జీతం రాకపోయినా ఉద్యోగం ఉంటే చాలని సొంతంగా ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ఒకరిద్దరు మాత్రమే విధులకు వస్తున్నారు. కొన్ని సార్లు వారూ ఉండరు. సిర్పూర్ సిటీలో లెక్కల ప్రకారం 11 మంది వైద్యులున్నారు. కాని విధులకు ఒక్కరే హాజరవుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
ఆస్పత్రులపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కోట్ల రూపాయలు వెచ్చించి దవాఖానాలు నిర్మించినా వైద్యుల లేమితో సర్కారు ఆశయం నీరుగారిపోతోంది. కనీసం చిన్న చిన్న వైద్య సేవలకు కూడా మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ రిఫరల్ ఆస్పత్రులుగానే మిగిలిపోతున్నాయి. ఆసక్తి లేని వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోతే కొత్తవారిని తీసుకునే అవకాశం ఉంటుంది కాని వారు విధులకు రాక.. రాజీనామా చేయక రోగుల జీవితాలతో ఆడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సిబ్బంది చేతివాటం
అసిఫాబాద్, సిర్పూర్ సిటీ ఆస్పత్రులకు ఒకే పర్యవేక్షణ అధికారిని నియమించారు. గతంలో ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. చిన్నా చితకా వైద్యం కోసం వచ్చే వారినుంచి వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి కుంటుపడిన సర్కారు వైద్యాలయాను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కోరుట్లలో రోగి మృతి... ఆగ్రహించిన బంధువులు